Site icon NTV Telugu

Iran-Israel War: రంగంలోకి అమెరికా.. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసేందుకు ప్రణాళిక!

Trump5

Trump5

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఇప్పటికే ఇరు పక్షాలు తీవ్ర స్థాయిలో దాడులు చేసుకుంటున్నాయి. ఆస్తి, ప్రాణ నష్టం భారీ స్థాయిలో జరుగుతోంది. అణు ఉత్పత్తిని నిలిపివేసేంత వరకు దాడులు కొనసాగుతాయని ఇజ్రాయెల్ హెచ్చరిస్తోంది. మరోవైపు తమతోనే అణు ఒప్పందం చేసుకోవాలంటూ అమెరికా అవకాశాలు ఇస్తోంది. కానీ అందుకు ఇరాన్ ససేమిరా అంటోంది. ఎవరితో ఎలాంటి ఒప్పందాలు చేసుకోమంటూ తేల్చి చెబుతోంది. దీంతో పరిణామాలు తీవ్ర ఉధృతం అవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Exclusive : వాయిదా పడుతున్న స్టార్ హీరోల సినిమాల షూటింగ్స్.. కారణాలు ఏంటి.?

తాజాగా ఈ యుద్ధంలోకి అగ్ర రాజ్యం అమెరికా కూడా దిగేందుకు సిద్ధపడుతోంది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై మరింత తీవ్రంగా దాడులు చేసేందుకు వైట్‌హౌస్ ప్రణాళికలు రచిస్తోంది. కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశం నుంచి అర్ధాంతరంగా ట్రంప్ వెళ్లిపోయారు. అనంతరం వైట్‌హౌస్‌లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సిట్యుయేషన్ రూమ్‌లో ఉన్నత స్థాయి జాతీయ భద్రతా మండలి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరాన్‌తో యుద్ధానికి దిగితే భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయని ఉన్నతాధికారులతో ట్రంప్ చర్చించినట్లు ఫాక్స్ న్యూస్ నివేదించింది. భవిష్యత్ వ్యూహాలపై ముఖ్య నేతలంతా మేథోమథనం చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: YS Jagan: నేడు రెంటపాళ్లకి వైఎస్‌ జగన్‌.. పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ!

అయితే ఈ సమావేశంలో ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయాలని అమెరికా నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు అందుతున్నాయి. ఇరాన్ అణు మౌలిక సదుపాయాలను దెబ్బకొట్టాలని అమెరికా భావిస్తోంది. పర్వతం లోపల లోతుగా దాచబడిన ఫోర్డో ప్లాంట్‌ను ధ్వంసం చేసేందుకు వైట్‌హౌస్ కసరత్తు చేస్తోంది.

ఇందుకోసం GBU-57 బంకర్ బస్టర్ బాంబును ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆక్సియోస్ నివేదించింది. B-2 స్పిరిట్ స్టెల్త్ బాంబర్లు ప్రత్యేకంగా పని చేయగలవని యూఎస్ సైన్యం భావిస్తోంది. GBU-57 బంకర్ బస్టర్.. లోతుగా పాతిపెట్టబడిన లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం ఉంటుంది. 61 మీటర్ల వరకు భూగర్భంలోకి చొచ్చుకుపోగలదు. అనుకున్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం దీని సొంతం. ఇరాన్ అణు స్థావరాలు నాశనం చేయడం అమెరికా ఆయుధ సామగ్రికే సాధ్యమని ఇజ్రాయెల్ కూడా భావిస్తోంది. ప్రస్తుతం ఆ సామర్థ్యం ఇజ్రాయెల్‌కు లేదు.

ప్రస్తుతం అమెరికాకు చెందిన అత్యాధునిక బాంబర్లు హిందూ మహాసముద్రంలోని డియెగో గార్సియాలోని అమెరికా-బ్రిటిష్ సైనిక స్థావరంలో మోహరించి ఉన్నాయి. ఇరాన్ నుంచి దాదాపు 2,358 మైళ్ళు (3,796 కి.మీ) దూరంలో ఉన్నాయి. కార్యకలాపాలు నిర్వహించే పరిధిలోనే ఈ బాంబర్లు ఉన్నట్లుగా బీబీసీ తన నివేదికలో పేర్కొంది.

Exit mobile version