నేడు పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంకు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. పోలీసుల వేధింపులతో గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత, ఉపసర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. విగ్రహా ఆవిష్కరణ అనంతరం జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి వెళ్లనున్నారు.
వైఎస్ జగన్ బుధవారం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి.. 11 గంటలకు రెంటపాళ్లకు చేరుకుంటారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరావు విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు జగన్ రెంటపాళ్ల నుంచి బయలుదేరి.. 1.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
Also Read: ENG vs IND: బుమ్రా ఆడొద్దని ఇంగ్లండ్ టీమ్ కోరుకుంటోంది.. బ్రాడ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
పల్నాడు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటనకు పోలీసుల ఆంక్షలు విధించారు. జగన్ వెంట కేవలం 3 వాహనాలు, 100 మంది వ్యక్తులకు మాత్రమే పోలీసులు అనుమతిని ఇచ్చారు. పోలీసుల ఆంక్షల మధ్య సత్తెనపల్లి పర్యటనకు జగన్ సిద్ధమయ్యారు. జగన్ పర్యటనకు భారీగా వైసీపీ కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉంది. దాంతో ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే పల్నాడు జిల్లాలో పలువురు నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆంక్షల నేపథ్యంలో జన సమీకరణపై నేతలకు పలు సూచనలు చేశారు. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ప్రస్తుతం పోలీసుల నిఘాలో రెంటపాళ్ల ఉంది. సత్తెనపల్లి నుంచి రెంటపాళ్ల వెళ్లేదారిలో పోలీసులు చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. రాజుపాలెం మండలం కొండమోడు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించనున్నారు.