Donald Trump: ఓ వైపు డీల్, మరోవైపు ఇజ్రాయిల్ దాడులు.. ట్రంప్ తీవ్ర అసంతృప్తి..

  • లెబనాన్‌పై ఇజ్రాయిల్ దాడులు..
  • ప్రమాదంలో ఇరాన్‌తో శాంతి ఒప్పందం..
  • దాడులు చేయొద్దని హెచ్చరించిన ట్రంప్..
Trump Netanyahu

Trump Netanyahu

Donald Trump: ఇజ్రాయిల్ లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఆదివారం దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు మరణించగా, 15 మంది గాయపడ్డారు. అయితే, ఈ దాడి వల్ల అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం ప్రమాదంలో పడింది. ఈ దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒప్పందాన్ని ఉల్లంఘించే స్థాయికి వెళ్లిందని ఇరాన్ ఫైర్ అయింది. ఈ దాడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇజ్రాయిల్‌పై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు చర్చలే ఉత్తమ మార్గమని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజిష్కియాన్ అన్నారు.

ఇరాన్‌తో శాంతి ఒప్పందానికి దగ్గరలో ఉన్నప్పుడు, ఈ ఉదయం బీరూట్‌పై దాడి జరగాల్సింది కాదని పేర్కొన్నారు. ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని ట్రంప్ చెబుతూనే, ఈ దాడి చాలా చిన్నదని పేర్కొన్నారు. ఈ దాడిలో ఎవరూ చనిపోలేదని లేదా గాయపడలేదని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెబనాన్‌పై ఇకపై ఎలాంటి దాడులు జరగకూడదని ట్రంప్ ఇజ్రాయిల్‌కు తేల్చి చెప్పారు. ఇజ్రాయిల్‌పై దాడుల చేయవద్దని హిజ్బుల్లాకు కూడా వార్నింగ్ ఇచ్చారు. శాంతి ఒప్పందాన్ని నాశనం చేయొద్దని అన్నారు.

×
×
Ad

లెబనాన్‌పై జరిగిన దాడిపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్ సైన్యం డిప్యూటీ కమాండర్ మాట్లాడుతూ.. ఇజ్రాయిల్ చర్యలకు తప్పకుండా జవాబు ఉంటుందని హెచ్చరించారు. ఆదివారం ఇజ్రాయిల్ లెబనాన్ రాజధాని బీరూట్‌లోని దహియా ప్రాంతంపై భారీ దాడి చేసింది. హిజ్బుల్లా మొదట ఉత్తర ఇజ్రాయిల్‌పై దాడి చేసిందని, అందుకే ప్రతీకారం తీర్చుకున్నామని ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూ సోషల్ మీడియాలో వెల్లడించారు.