FIFA ఫైనల్లో ట్రంప్‌కు ఊహించని అవమానం.. అసలేం జరిగిందంటే?

  • స్పెయిన్ విజయోత్సవంలో ట్రంప్ ఓవర్ యాక్షన్?
  • సంబరాల మధ్య ట్రంప్‌ను స్టేజ్‌ నుంచి పక్కకు జరిపిన FIFA చీఫ్!
  • ప్రపంచం చూస్తుండగానే ట్రంప్‌కు షాక్..
Donald Trump

Donald Trump

FIFA: ఫిఫా పురుషుల ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అట్టహాసంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ కేవలం స్పెయిన్ విజయం వల్లే కాకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఎదురైన చేదు అనుభవం కారణంగా కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. న్యూయార్క్–న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన ట్రోఫీ ప్రదానోత్సవంలో ట్రంప్‌కు ప్రేక్షకుల నుంచి హూటింగ్ ఎదురవడం, అనంతరం FIFA అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో ఆయనను స్టేజ్‌పై పక్కకు జరపడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పెయిన్ ఫైనల్‌లో అర్జెంటీనాపై విజయం సాధించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మ్యాచ్ అనంతరం ట్రోఫీ ప్రదానోత్సవం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, FIFA అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో మైదానంలోకి అడుగుపెట్టగానే స్టేడియంలో ఉన్న కొందరు అభిమానులు పెద్ద ఎత్తున హూటింగ్ చేశారు. అయితే ఆటగాళ్లకు పతకాలు అందజేసే కార్యక్రమం ప్రారంభమైన తర్వాత ఆ హూటింగ్ క్రమంగా తగ్గిపోయింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక హెలికాప్టర్‌లో స్టేడియానికి చేరుకుని ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించారు. ట్రోఫీ అందజేసిన అనంతరం కూడా ఆయన స్పెయిన్ ఆటగాళ్లతో కలిసి వేదికపై నిలిచారు. అయితే స్పెయిన్ కెప్టెన్ రోడ్రీ ప్రపంచకప్ ట్రోఫీని ఎత్తి అభిమానులకు చూపించే సమయంలో FIFA అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినో ట్రంప్‌ను వేదికపై ఒకవైపుకు జరిపిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ ఘటనకు ముందు నుంచే ట్రంప్ ఫుట్‌బాల్ ప్రపంచంలో వివాదానికి కేంద్రబిందువయ్యారు. గ్రూప్ దశలో అమెరికా–బోస్నియా అండ్ హెర్జెగోవినా మ్యాచ్ సందర్భంగా అమెరికా స్ట్రైకర్ ఫోలారిన్ బాలోగన్‌కు రెడ్ కార్డ్ చూపించడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ నిర్ణయాన్ని మరోసారి సమీక్షించాలని FIFA అధ్యక్షుడు జియానీ ఇన్‌ఫాంటినోకు నేరుగా ఫోన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఒక దేశాధినేత ఆట నిబంధనలు, రిఫరీ నిర్ణయాల్లో నేరుగా జోక్యం చేసుకోవాలని ప్రయత్నించడం సరికాదంటూ ప్రపంచవ్యాప్తంగా పలువురు ఫుట్‌బాల్ నిపుణులు, అభిమానులు తీవ్ర విమర్శలు చేశారు. అదే వివాదం ప్రభావం ఫైనల్ ట్రోఫీ ప్రదానోత్సవంలోనూ కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్‌కు ఎదురైన హూటింగ్, స్టేజ్‌పై జరిగిన పరిణామాలు ప్రస్తుతం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.