Site icon NTV Telugu

UAE: నేడు యూఏఈలో రష్యా-అమెరికా-ఉక్రెయిన్ కీలక భేటీ.. చర్చలపై సర్వత్రా ఉత్కంఠ

Trump

Trump

రష్యా-ఉక్రెయిన్ మధ్య మరోసారి శాంతి చర్చలు జరగబోతున్నాయి. అయితే ఈసారి రష్యా-అమెరికా-ఉక్రెయిన్ త్రైపాక్షిక సమావేశం జరగనుంది. ఇందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదిక కానుంది. నేటి నుంచి రెండు రోజుల పాటు యూఏఈలో ఈ సమావేశం జరగబోతుందని దావోస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. ఇలా త్రైపాక్షిక సమావేశం ఇదే తొలిసారి కావడం విశేషం.

జెలెన్‌స్కీ..
ఉక్రెయిన్, రష్యా, అమెరికా మధ్య మొదటి త్రైపాక్షిక సమావేశం జరుగుతోందని.. ఇది యుద్ధం ముగింపునకు దారితీస్తుందని జెలెన్‌స్కీ ఆశాభావం వ్యక్తం చేశారు. దావోస్‌లో ట్రంప్‌తో జెలెన్‌స్కీ గంట సేపు సమావేశం అయ్యారు. సమావేశం తర్వాత ట్రంప్‌తో మంచి చర్చలు జరిపినట్లుగా వెల్లడించారు. గురువారం ఉక్రెయిన్ బృందం ట్రంప్‌తో సమావేశమైందని.. అమెరికా బృందం రష్యాకు వెళ్తోందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. యుద్ధం కారణంగా ఉక్రెయిన్ చాలా నష్టపోయిందని.. ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించడానికి.. శాంతి పరిష్కారానికి దౌత్య ప్రయత్నాలు జరుగుతున్నాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. శాంతి చర్చలపై గంట సేపు ట్రంప్‌తో చర్చించినట్లు పేర్కొన్నారు.

ట్రంప్..
ఇక జెలెన్‌స్కీతో భేటీ తర్వాత ట్రంప్ మాట్లాడుతూ.. చర్చలు సానుకూలంగా జరిగాయని.. యుద్ధం ముగియాలని ఆకాంక్షించారు. అమెరికా బృందం పుతిన్‌ను కలవబోతుందని చెప్పారు. ఇప్పటికే చాలా మంది చనిపోయారు.. ఇక యుద్ధం ముగించాలని స్పష్టం చేశారు. మరిన్ని ప్రాణనష్టాలు జరగకుండా తక్షణమే కాల్పుల విరమణ జరగాల్సి ఉందని తెలిపారు. ఇద్దరు నాయకులు కూడా కాల్పుల విరమణకు ముందుకు రావాలని పుతిన్, జెలెన్‌స్కీకి ట్రంప్ పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి: Jharkhand Video: జార్ఖండ్‌లో తప్పిన రైలు ప్రమాదం.. లెవెల్ క్రాసింగ్ దగ్గర ట్రక్కును ఢీకొన్న రైలు

ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సౌదీ అరేబియా వేదికగా అమెరికా చర్చలు జరిపింది. కానీ చర్చలు ఫలించలేదు. అనంతరం నేరుగా ట్రంప్ రంగంలోకి దిగి అలాస్కా వేదికగా పుతిన్‌తో సమావేశం అయ్యారు. అనంతరం వైట్‌హౌస్‌లో జెలెన్‌స్కీతో సమావేశం అయ్యారు. అయినా కూడా ఫలించలేదు. అటు తర్వాత 28 పాయింట్లు ప్రణాళికను ట్రంప్ తీసుకొచ్చారు. దీనికి పుతిన్ అంగీకారం తెలపగా.. జెలెన్‌స్కీ వ్యతిరేకించారు. ఇది కూడా దారి చూపించలేదు. ఇప్పుడు యూఏఈ వేదిక సమావేశం జరుగుతోంది. ఈ చర్చలైనా ఫలిస్తాయో లేదో చూడాలి.

ఇది కూడా చదవండి: Rahul Sankrityan: ‘ప్రామిస్.. మీ ఆకలి తీరుస్తా’! విజయ్ ఫ్యాన్‌కు డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ క్రేజీ రిప్లై..

Exit mobile version