బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు తగ్గడం లేదు. భారత వ్యతిరేక నాయకుడు ఉస్మాన్ హాదీ హత్య తర్వాత మీడియా సంస్థలు, హిందువులు లక్ష్యంగా దాడులు జరిగాయి. అల్లర్లతో దేశం అట్టుడుకింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. ఇదిలా ఉంటే గ్లోబల్ టీవీ బంగ్లాదేశ్ చీఫ్ నజ్నిన్ మున్నీని ఓ గ్యాంగ్ హత్యా బెదిరింపులు చేశారు. వెంటనే ఆమెను తొలగించాలని.. లేదంటే కార్యాలయాన్ని తగలబెడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఉస్మాన్ హాదీ హత్య తర్వాత డిసెంబర్ 21న కొంత మంది యువకులు ఢాకాలోని గ్లోబల్ టీబీ బంగ్లాదేశ్ కార్యాలయాన్ని సందర్శించి నజ్నిన్ మున్నీ తొలగించాలని డిమాండ్ చేశారు. ఆమె షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ మద్దతుదారుడని యువకులు పేర్కొన్నారు. మున్నీని తొలగించకపోతే ప్రోథోమ్ అలో, ది డైలీ స్టార్‌పై జరిగిన దాడుల మాదిరిగానే ఛానల్ కార్యాలయాన్ని తగలబెడతామని హెచ్చరించినట్లు సమాచారం.
‘‘వివక్ష వ్యతిరేక విద్యార్థి ఉద్యమం పేరుతో దాదాపు 7-8 మంది నా కార్యాలయానికి వచ్చి నేను నా ఉద్యోగాన్ని వదులుకోకపోతే నిప్పంటిస్తామని బెదిరించారు. సంఘటన జరిగినప్పుడు తాను ఆఫీసులో లేనని చెప్పారు. మేనేజింగ్ డైరెక్టర్‌ను కలిసి ఉస్మాన్ హాదీ మరణం గురించి కవరేజ్ తగినంతగా లేదని ఫిర్యాదు చేశారు.’ అని జర్నలిస్ట్ నజ్నిన్ మున్నీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. అయితే తనకు ఏ పార్టీతో సంబంధాలు లేవని మున్నీ తెలిపారు.