కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు మొగ్గుచూపుతున్నారు.. మొదటల్లో కొన్ని అపోహలు ఉన్నా.. ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతో ప్రజలు వ్యాక్సిన్ కోసం పోటీపడే పరిస్థితి వచ్చింది. అయితే, గత 4 వారాల్లో సింగపూర్‌లో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల్లో 75 శాతం కేసులు వ్యాక్సిన్ తీసుకున్నవారిలో నమోదయ్యాయని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. సింగపూర్ సిటీలో ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టడంతో టీకాలు తీసుకోని వారిసంఖ్య పరిమితంగా ఉంది. యూఏఈ తర్వాత సింగపూర్‌లోనే అత్యధికంగా 75 శాతం జనాభాకు టీకాలు వేశారు. జనాభాలో సగం మంది వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారు. కానీ, ఈ గణాంకాలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి.
సింగపూర్‌లో గత నాలుగు వారాల్లో 1096 కరోనా కేసులు నమోదు కాగా.. అందులో 44 శాతం మంది అంటే 484 మంది వ్యాక్సిన్ పూర్తి డోస్ తీసుకున్న వారు ఉన్నారు.. ఇక, 30 శాతం మంది పాక్షికంగా టీకాలు తీసుకున్నవారు ఉన్నారు. 25 శాతం మంది రోగులు అసలు టీకా సింగిల్ డోస్ కూడా తీసుకోలేదు. ఈ కేసుల్లో తీవ్ర లక్షణాలతో దవాఖానాలో చేరి ఆక్సిజన్ అవసరమైన వారు కేవలం ఏడుగురు కాగా వీరిలో ఐదుగురు టీకా తీసుకోని వారు ఒకరు సింగిల్ డోసు తీసుకున్న వ్యక్తి ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే, వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, కొందరిలో స్వల్ప లక్షణాలు కనిపించాయని వెల్లడించింది. సింగపూర్‌లో అత్యధిక జనాభా టీకాలు తీసుకోవడంతో వారిలోనూ ఇన్ఫెక్షన్స్ నమోదయ్యాయని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ డీన్ టియో యక్ యింగ్ పేర్కొన్నారు. కాగా, అక్కడ ప్రజలకు ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచింది ప్రభుత్వం.