అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. అక్కడ గన్ కల్చర్ ప్రజల ప్రాణాలకు భద్రత లేకుండా చేస్తోంది.ఇటీవల కాలంలో అమెరికాలోని పలు రాష్ట్రాల్లో కాల్పుల ఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా అమెరికాలో జరిగిన కాల్పుల్లో అభంశుభం తెలియని స్కూల్ పిల్లలు మరణించారు. ఓ వ్యక్తి విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 18 మంది స్కూల్ పిల్లలు, మరో ముగ్గురు మొత్తంగా 21 మంది చనిపోయారు. టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని గవర్నర్ గ్రెగ్ అబాట్ ధ్రువీకరించారు. మొత్తం 21 మందిలో ఇద్దరిని కొనఊపిరితో ఆస్పత్రికి చేర్చగానే మరణించినట్లు వెల్లడించారు. చనిపోయిన పిల్లల్లో ఎక్కువ మంది 4 ఏళ్ల నుంచి 11 ఏళ్ల వయసున్న వారే అధికంగా ఉన్నారు.
ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని సాల్వడార్ రామోస్ గా పోలీసులు ధ్రువీకరించారు. ఇతడు ఓ హత్య నేరంలో అనుమానితుడిగా ఉన్నాడు. పోలీసులు వెంబడిస్తున్న సమయంలో అతను తన ట్రక్కు నుంచి దిగి రాబ్ ఎలిమెంటరీ స్కూల్ లోకి ప్రవేశించి స్కూల్ పిల్లలపైకి విచక్షణరహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగిన తెలుసుకుని వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. ఘటనకు పాల్పడిని రామోస్ ను పోలీసులు కాల్చి చంపేశారు.
ఇటీవల కాలంలో అమెరికాలో వరసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత వారం న్యూయార్క్ బఫెల్లో లోని ఓ సూపర్ మార్కెట్ లో కాల్పులు జరిగాయి. నల్లజాతీయులే లక్ష్యంగా జరిగిన ఈ కాల్పుల్లో 10 మంది మరణించారు. మరో ముగ్గరు తీవ్రంగా గాయపడ్డారు. అంతకు ముందు కూడా ఇలాగే ఓ సబ్ వేలో కాల్పలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనపై అధ్యక్షుడు బైడెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. జాతీయ పతాకాన్ని అవనతం చేయాలని ఆదేశాలు ఇచ్చాడు.