తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తరువాత 2001 కి ముందు పరిస్థితులు వస్తాయోమో అని చెప్పి చాలామంది ప్రజలు దేశాన్ని వదిలి వెళ్లిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కాబూల్ ఎయిర్‌పోర్ట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. మరోవైపు ప్రభుత్వానికి సహకరించిన వారి వివరాలు సేకరిస్తున్నారనే వార్తలు రావడంతో ప్రజల్లో మరింత ఆందోళన మొదలైంది. వీలైనంతవరకు దేశాన్ని వదిలి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో తాలిబన్ నేతలు కీలక ప్రకటన చేశారు. ఎవరి ఇళ్లలోకి చొరబడొద్దని, ఆయుధాలు తీసుకోవద్దని, ప్రజల ఆస్తులను కాపాడాలని ఇస్లామిక్ ఎమిరేట్ డిప్యూటీ కీలక నేత ముల్లా యాకూబ్ ఆదేశాలు జారీ చేశారు. తాలిబన్ కీలక నేత ఆదేశాలతో కాబూల్ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ ఉదయం నుంచి మెడికల్, కూరగాయల దుకాణాలు, బేకరీలు తిరిగి తెరుచుకున్నాయి. నిత్యవసర వస్తువుల కోసం ప్రజలు పెద్ద ఎత్తున క్యూకట్టారు.