Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ మహిళా విద్యకు ఆస్కారమే లేకుండా పోయింది. తాజాగా పీజీ విద్యార్థినులు విద్యపై కూడా నిషేధం తెలిపింది తాలిబాన్ సర్కార్. మహిళలు ఎంతగా తమ నిరసన తెలిపినా కూడా తాలిబాన్లు వాటన్నింటిని అణిచివేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇస్మాయిల్ మషాల్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సర్టిఫికేట్లను ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రాంలోనే చించేశారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయింది. తన అక్కా చెల్లెల్లకు, తల్లులకు అవసరం లేని విద్య తనకు ఎందుకంటూ నిరసన తెలిపారు.
Read Also: INDvsAUS Test: అశ్విన్ కోసం ఆసీస్ డూప్లికేట్ వ్యూహం..అచ్చు అశ్విన్ లానే!
ఇదిలా ఉంటే ప్రస్తుతం జర్నలిజం లెక్చరర్ ఇస్మాయిల్ మషాల్ ను తాలిబాన్లు నిర్భంధించారు. విద్యావేత్త అనే కనికరం లేకుండా కొడుతూ, అగౌరవంగా అదుపులోకి తీసుకున్నారని అతని సహాయకుడు వెల్లడించారు. ఇటీవల కాలంలో మషాల్ కాబూల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పుస్తకాలను పంచుతున్నారు. ఈ చర్యల నేపధ్యంలో తాలిబాన్లు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లామిక్ ఎమిరేట్ సభ్యులు మషాల్ ను కనికరం లేకుండా కొట్టారని అతని సహాయకుడు ఫరీద్ అహ్మద్ ఫజ్లీ అన్నారు. మషాల్ ను అరెస్ట్ చేసినట్లు తాలిబాన్ అధికారులు కూడా ధృవీకరించారు.
కొంతకాలంగా వ్యవస్థకు వ్యతిరేకంగా మషాల్ రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతున్నారని..సమాచార మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ డైరెక్టర్ అబ్దుల్ హక్ హమ్మద్ ట్వీట్ చేశారు. అధికారులు అతడిని విచారిస్తున్నట్లు తెలిపాడు. కాబూల్ లోని మూడు యూనివర్సిటీల్లో ఫ్రొఫెసర్ గా ఉన్నారు మషాల్. ఏ నేరం చేయనప్పటికీ మహిళా విద్యకు సపోర్టు చేస్తున్న కారణంగా తాలిబన్లు అతడిని నిర్భంధంలోకి తీసుకున్నారు. తాలిబాన్ పాలనలో మహిళలు చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి, జిమ్ లు, పార్కులకు వెళ్లేందుకు కూడా అనుమతి లేదు.