Turkey: టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగాన్ మరోసారి పాలస్తీనా, హమాస్ పక్షానికి మద్దతుగా నిలిచారు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా భూభాగంపై దాడులను తీవ్రతరం చేసిన తర్వాత.. ఈ దాడులకు స్వస్తి చెప్పాలని ఎర్డోగాన్ శనివారం ఇజ్రాయిల్ ని కోరారు. ఇజ్రాయిల్ ‘‘తక్షణమే ఈ పిచ్చిని ఆపేయాలి’’ అని పిలుపునిచ్చాడు. గత రాత్రి గాజాపై ఇజ్రాయిల్ బాంబు దాడులు తీవ్రమయ్యాయి. మరోసారి మహిళలు, పిల్లలు, అమాయక పౌరులను లక్ష్యంగా చేసుకున్నాయి, కొనసాగుతన్న మానవత సంక్షోభాన్ని మరింత దిగజార్చాయి అని ఎర్డోగాన్ ఎక్స్(ట్విట్టర్)లో వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్ వెంటనే ఈ ‘మ్యాడ్ నెస్’ని ఆపేయాలని, దాడులను ముగించాలని కోరారు. ఎర్డోగాన్ శనివారం ఇస్తాంబుల్ లో పాలస్తీనాకు మద్దతుగా తన పార్టీ ఇస్లామో-కన్సర్వేటివ్ ఏకేపీ పార్టీ నిర్వహించనున్న ర్యాలీని ప్రోత్సహించాడు. ఈ ర్యాలీకి దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. ఇజ్రాయిల్ కి వ్యతిరేకంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఉంటాని ఎర్డోగాన్ ప్రకటించారు.
Read Also: Yogesh Kadyan: పెన్ను పట్టుకోవాల్సిన వయసులో గన్ను పట్టుకున్నాడు .. 19 ఏళ్లకే రెడ్ కార్నర్ నోటీసులు
రెండున్నర దశాబ్ధాలుగా అధికారంలో ఉన్న ఎర్డోగాన్ పలుమార్లు పాలస్తీనాకు మద్దతు ప్రకటించారు. సెప్టెంబర్ నెలలో మొదటిసారిగా ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో సమావేశం అయ్యారు. అయితే ప్రస్తుతం ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో మరోసారి పాలస్తీనా స్టాండ్ తీసుకున్నారు. హమాస్ నాయకులు ఉగ్రవాదులు కాదని, తమ భూమి కోసం పోరాడుతున్న విముక్తి పోరాట యోధులుగా అభివర్ణించారు.
అక్టోబర్ 7న ఇజ్రాయిల్‌పై హమాస్ మిలిటెంట్లు దాడులు చేశారు. ఈ దాడుల్లో 1400 మంది ఇజ్రాయిలీలు మరణించగా.. 229 మందిని బందీలుగా హమాస్ మిలిటెంట్లు బంధించారు. మరోవైపు ఇజ్రాయిల్ గాజాపై జరుపుతున్న దాడుల్లో ఇప్పటి వరకు 7000కు పైగా ప్రజలు మరణించారు. ఇందులో 3000 మంది పిల్లలు ఉన్నారు.