తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీపదేశం శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే…మరోవైపు పెట్రోల్,డిజిల్ ధరలు పెరగడంతో పాటు తీవ్ర కొరత కూడా అక్కడి ప్రజలను వేధిస్తోంది. పెట్రోల్ కొనేందుకు కూడా శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు లేవు. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు లేని పెట్రోల్ కు కూడా అక్కడి ప్రభుత్వం ధరలను పెంచుతోంది. తాజాగా శ్రీలంకలో పెట్రోల్ ధర రూ. 400 దాటింది.
ఇదిలా ఉంటే శ్రీలంక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ప్రయత్నిస్తున్నాడు. ప్రధాని పదవికి మహిందా రాజపక్స రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే ను నియమించాడు. ఆయనతో పాటు కొత్తగా 9 మంది మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే సంక్షోభ పరిస్థితుల్లో అత్యంత కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖకు మంత్రిని నియమించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ప్రధాని రణిల్ విక్రమసింఘే కే ఆర్థిక మంత్రిత్వ శాఖను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఐదు సార్లు ప్రధానిగా చేసిన అనుభవం రణిల్ విక్రమసింఘేకు ఉండటంతో ఈ సంక్షోభ పరిస్థితి నుంచి దేశాన్ని బయటపడేస్తాడని అక్కడి ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నిరసనలు ఆగడం లేదు. అధ్యక్షడు గోటబయ రాజపక్స గద్దె దిగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల రాజధాని కొలంబోలో అధ్యక్ష అధికారిక నివాసం ముందు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. శ్రీలంక పరిస్థితికి రాజపక్సల పాలన, చైనా అప్పులే కారణం అని ప్రజలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు.