దక్షిణ కొరియాలో కార్చిచ్చులు బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలివానల కారణంగా చెలరేగిన కార్చిచ్చులు కారణంగా 18 మంది చనిపోయారు. 19 మంది గాయపడ్డారు. ఇక రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక సమీపంలో ఉన్న ఇళ్లను ఖాళీ చేయించారు. ఇక ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 200కు పైగా నిర్మాణాలు కాలిపోయాయి. బలమైన గాలుల కారణంగానే ఈ మంటలు చెలరేగుతున్నాయని అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో 1300 సంవత్సరాల పురాతన బౌద్ధ దేవాలయం దగ్ధమైంది. దాదాపు ఇప్పటి వరకు 43,330 ఎకరాలకు పైగా దగ్ధమైనట్లు సమాచారం. ఇలాంటి ఘటనల్లో ఇప్పటివరకు మూడవ అతిపెద్దదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
మంటలు ఆర్పేందుకు 10 వేల మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది, పౌర సేవకులు పని చేస్తున్నారు. స్థానిక నివాసితులను ఖాళీ చేయమని ఇప్పటికే ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. 68 శాతం మంటలు అదుపులోకి వచ్చాయని తెలిపారు. ఉత్తర, దక్షిణ జియోంగ్‌సాంగ్, ఉల్సాన్ నగరంలోని అనేక ప్రాంతాల్లో మాత్రం మంటలు వేగంగా వ్యాపిస్తున్నట్లు పేర్కొన్నారు.
దక్షిణ కొరియా ప్రధానమంత్రి, తాత్కాలిక అధ్యక్షుడు హన్ డక్- సూ స్పందించారు. ఎప్పుడూ జరగని విధంగా ఈసారి కార్చిచ్చు చెలరేగిందన్నారు. ఇది అత్యంత ఘోరమైనదిగా అభివర్ణించారు. మంటలను అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టిసారించినట్లు చెప్పారు. పొరుగు ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండేందుకు ప్రజలు అధికారులకు సహకరించాలని కోరుతున్నట్లు విజ్ఞప్తి చేశారు.