NTV Telugu Site icon

Canada: “పెరట్లో పామును పెంచుతున్నాం”.. ఖలిస్తానీలపై భారత సంతతి ఎంపీ హెచ్చరిక..

Chandra Arya

Chandra Arya

Canada: ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా వేదికగా మారుతోంది. భారత వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా దేశాన్ని వినియోగించుకుంటున్నారు ఖలిస్తానీలు. ఇప్పటికే కెనడాలోని పలు భారత రాయబార కార్యాలయాలపై ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత్ నుంచి పంజాబ్ ను విభజించి సపరేట్ ఖలిస్తాన్ దేశాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో భారతదేశానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కెనడానే కాకుండా యూకే, ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు బలపడుతున్నారు.

Read Also: Tomatoes stolen: కర్ణాటకలో టమాటాల దొంగతనం.. కేసు నమోదు..

ఇదిలా ఉంటే ఖలిస్తానీ చర్యలపై కెనడాలోని భారతసంతతికి చెందిన ఎంపీ, లిబరల్ పార్టీ నేత చంద్ర ఆర్య ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఖలిస్తాన్ మద్దతుదారులు కొంతమంది భారత దౌత్యవేత్తల ఫోటోలతో పోస్టర్లు వేసి బెదిరించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై చంద్ర ఆర్య స్పందించారు. కెనడా ‘‘ పెరట్లో పాములు పెంచుతోంది, ఆ పాములు తల ఎత్తుకుని బుసలు కొడుతున్నాయి’’ అని హెచ్చరించారు. ఇలా పోస్టర్లో దౌత్యవేత్తలను బెదిరించడాన్ని ఖండించారు. కెనడాలో ఖలిస్తానీలు హింస, ద్వేషాన్ని ప్రొత్సహించడం ద్వారా హక్కులు, స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఆ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. పెరట్లో పాములు బుసలు కొడుతున్నాయి, అవి ఎప్పుడు మనల్ని కాటేస్తాయో అనేదే ప్రశ్న అంటూ కామెంట్స్ చేశారు.

జూలై 8న జరగనున్న ‘ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీ’ని ఖలిస్తానీలు నిర్వహిస్తున్నారు. టొరంటో, అట్టావా, వాంకోవర్ నగరాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలకు పిలుపునిచ్చారు. ఓ పోస్టర్ విడుదల చేస్తూ.. ఒట్టావాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ మరియు టొరంటోలోని కాన్సుల్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవను ‘‘కిల్లర్స్’’గా అభివర్ణించారు. వీరిని ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్ హర్దీప్ సింగ్ నిజ్జర్ కిల్లర్స్ గా పేర్కొన్నారు. గత నెల భారత మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీని చంపేసిన విధానాన్ని ప్రతిబింబించేలా ఓ శకటాన్ని పెరేడో లో ప్రదర్శించారు. ఈ చర్యలు కెనడా, ఇండియా దేశాల మధ్య ఘర్షణలు ప్రేరేపించాయి. ఇదే జరుగుతూ ఉంటే ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయిని విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా స్పందించారు. సోమవారం భారత్ లోని కెనడా రాయబారికి సమన్లు జారీ చేసింది.