తాలిబన్ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేవి.. నియంత పాలన.. కఠిన నిబంధనలు.. అయితే గత కొన్ని నెలల క్రితం అఫ్ఘానిస్తాన్‌ను తాలిబన్‌ను ఆక్రమించిన సంగతి తెలిసిందే. అయితే.. అక్కడ మహిళలు బయటకు రాకుండా హుకుంలు జారీ చేశారు. అంతేకాకుండా మహిళల స్వేచ్చపై ఉక్కుపాదం మోపారు. మొదట్లో మహిళలకు స్వేచ్చనిస్తామని ప్రకటించిన తాలిబన్ల అమలు చేయలేదు. దీంతో తాలిబన్ల తీరుపై ప్రపంచ దేశాలు పెదవి విరవడంతో.. ఇప్పుడు మళ్లీ తాలిబన్లలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.
మహిళలకు త్వరలోనే ‘గుడ్‌న్యూస్’ చెబుతామని ఆ దేశ అంతర్గత శాఖ తాత్కాలిక మంత్రి, తాలిబన్ కో-డిప్యూటీ లీడర్ సిరాజుద్దీన్ హక్కానీ ప్రకటించారు. హైస్కూలు చదువులకు అమ్మాయిలను మళ్లీ అనుమతిస్తామని ఆయన పేర్కొన్నారు. గతంలోనే వారు ఈ హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాలేదు. ఇప్పుడు తాజా ప్రకటనతో మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, తమకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళలు మాత్రం ఇంటికే పరిమితం అవుతారని చెప్పారు సిరాజుద్దీన్ హక్కానీ. ఎట్టకేలకు మళ్లీ ఇన్నాళ్లకు తమ నిర్ణయాన్ని మార్చుకున్న తాలిబన్లు అమ్మాయిలు చదువుకునేందుకు అవకాశం ఇస్తామని చెప్పడం శుభపరిణామంగానే భావిస్తున్నారు. తాలిబన్ పాలనలో మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారన్న ప్రశ్నకు సిరాజుద్దీన్ హక్కానీ బదులిస్తూ.. కొంటె మహిళలలు (నాటీ విమెన్) మాత్రం ఇంటికే పరిమితమవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరి వ్యక్తుల నియంత్రణలో ఉంటూ తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసిన వారిని ఉద్దేశించి ఇలా ‘కొంటె మహిళలు’ అని జోక్ చేసినట్టు వివరించారు సిరాజుద్దీన్ హక్కానీ.