Japan PM: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిద వారసుడిగా మాజీ రక్షణశాఖ మంత్రి షిగెరు ఇషిబా ఎంపికయ్యారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డీపీ) అధ్యక్ష ఎన్నికల్లో ఆయన గెలిచారు. దీంతో అక్టోబరు 1వ తేదీన ఇషిబా దేశ 102వ ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎల్‌డీపీ అధ్యక్షుడిగా 2021లో కిషిద ఎన్నికయ్యారు. ఆయన మూడేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబరుతో ముగియనుంది. దీంతో పార్టీకి అధ్యక్ష ఎన్నికలు నిర్వహించింది. అవినీతి ఆరోపణల దృష్ట్యా కిషిద ఈ ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే పార్టీ అధినాయకత్వ పదవికి 9 మంది పోటీపడగా.. వీరిలో ఇద్దరు మహిళలు సైతం ఉన్నారు.
Read Also: President Droupadi Murmu: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
కాగా, ఎల్‌డీపీ పార్లమెంట్ సభ్యులతో పాటు దాదాపు 10 లక్షల మంది పార్టీ సభ్యులు ఈ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత కౌంటింగ్ చేపట్టి షిగెరు ఇషిబా విజయం సాధించినట్లు వెల్లడించారు. అయితే, 67 ఏళ్ల ఇషిబా కెరీర్ ఆరంభంలో బ్యాంకింగ్ సెక్టార్ లో పని చేశారు. తన 29 ఏళ్ల వయసులో 1986లో తొలిసారిగా పార్లమెంట్‌కు ఎంపికయ్యాడు. ప్రభుత్వ విధానాలను బహిరంగంగా వ్యతిరేకిస్తూ తరచూ ఇషిబా వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలో కిషిద సర్కార్ లో ఆయనను పక్కనబెట్టింది. గత ఎల్‌డీపీ ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా కూడా ఇషిబా పని చేశారు.