Site icon NTV Telugu

Trump: నేడు ట్రంప్‌తో షెహజాజ్ షరీఫ్, అసిమ్ మునీర్ భేటీ.. నిశితంగా పరిశీలిస్తున్న భారత్

Trump2

Trump2

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. యూఎన్ సమావేశాల్లో పాల్గొనేందుకు అమెరికా వెళ్లారు. ఇక ట్రంప్ ఆహ్వానం మేరకు గురువారం వైట్‌హౌస్‌కు వెళ్లనున్నారు. ట్రంప్‌తో షెహబాజ్ షరీఫ్‌తో పాటు అసిమ్ మునీర్ కూడా హాజరు కావడంపై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ప్రధానితో పాటు ఆర్మీ చీఫ్ కూడా వైట్‌హౌస్‌కు రావడం ఇదే తొలిసారి. అయితే ఈ సమావేశం సాధారణ దౌత్య కార్యక్రమంగా చెబుతున్నా.. దీని వెనుక ఉద్దేశం మాత్రం వేరే ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Trump: యూఎన్‌లో కుట్ర జరిగింది.. కారకాల అరెస్ట్‌కు ట్రంప్ ఆదేశాలు

ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక ప్రయోజనాల నేపథ్యంలోనే ఈ సమావేశం జరుగుతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య ముస్లిం దేశాలన్నీ ఇస్లామిక్ నాటోగా మారుతున్నాయి. ఇప్పటికే పాకిస్థాన్-సౌదీ అరేబియా రక్షణ ఒప్పందం చేసుకున్నాయి. మరిన్ని దేశాలను కూడా కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను దగ్గర చేసుకోవాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Ladakh Violence: లడఖ్ హింస‌పై కేంద్రం ప్రత్యేక దృష్టి.. కీలక సమాచారం సేకరణ!

ఇదిలా ఉంటే ఆప్ఘనిస్థాన్‌లో బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని తాలిబాన్ల నుంచి తిరిగి తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ సహకారాన్ని ట్రంప్ కోరవచ్చని సమాచారం. లాజిస్టిక్‌గా, దౌత్యపరంగా లేదా నిఘా భాగస్వామ్యంలో సహకరించాలని ఒత్తిడి కోరవచ్చు. ఇందుకోసమే పాక్ నేతలను ట్రంప్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అమెరికాకు పాకిస్థాన్ సహకరిస్తే మాత్రం శత్రువుగా భావించాల్సి ఉంటుందని ఇప్పటికే తాలిబాన్లు హెచ్చరించారు.

ఇక భారతదేశం అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మే నెలలో భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరిగింది. అనంతరం తన చొరవతోనే యుద్ధం ఆగిందని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. కానీ భారత్ మాత్రం ఖండిస్తోంది. పాకిస్థాన్ మాత్రం ట్రంప్ కారణంగానే యుద్ధం ఆగిందని చెబుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న షెహబాజ్ షరీఫ్ మరోసారి గుర్తుచేశారు. ట్రంప్ ప్రపంచ శాంతి కాముకుడు అంటూ అభివర్ణించారు. ఇక అసిమ్ మునీర్ మరో అడుగు ముందు కేసి గత పర్యటనలో ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి ప్రమోట్ చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జరిగే సమావేశంలో కూడా భారత్ ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ అంశాన్ని భారత్ నిశితంగా పరిశీలిస్తోంది.

Exit mobile version