Scammers: దొంగతనాల రూటే మారింది. గతంలో మాదిరిగా ఇళ్లలో నగలు, డబ్బును ఎత్తుకెళ్లడం తగ్గింది. దీని స్థానంలో ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. మనకు తెలియకుండా మన బ్యాంకుల నుంచి కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగా ఓ రిపోర్టు ప్రకారం ఏడాది కాలంలో 1.02 ట్రిలియన్ డాలర్ల సొమ్మును కొల్లగొట్టినట్లు తెలిపింది. ఈ అధ్యయనం 43 దేశాలకు చెందిన 49,459 మందిని సర్వే చేసింది. వారు ఎలాంటి మోసాల బారిన పడ్డారు, ఎంత డబ్బు కోల్పోయారనే వివరాలను అడిగింది.
గ్లోబల్ యాంటీ-స్కామ్ అలయన్స్ (GASA), స్కామ్ అడ్వైజర్‌ల అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 2022- ఆగస్టు 2023 మధ్య స్కామర్‌లు 1.02 ట్రిలియన్ డాలర్ల అంచనా మొత్తాన్ని కొల్లగొట్టారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలను పరిశీలిస్తే సింగపూర్ లో ఎక్కువ బాధితులు ఉన్నట్లు తేలింది. 2021లో 55.3 బిలియన్ డాలర్లు, 2020లో 47.8 బిలియన్ డాలర్లను మోసగాళ్లు కొట్టేశారు.
Read Also: Bangalore Metro: బెంగళూరు మెట్రోలో 2 కొత్త సెక్షన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
పోర్చుగల్ లోని లిస్బన్ లో నాల్గవ వార్షిక గ్లోబర్ యాంటీ-స్కామ్ సమ్మిట్ లో GASA మేనేజింగ్ డైరెక్టర్ జోరిజ్ అబ్రహం ఈ డేటాను వెల్లడించారు. స్కామర్లు మరింత అధునాతన పద్దతులను ఉపయోగించి ఆన్ లైన్ షాపింగ్, ఐడెంటిటీ థెఫ్ట్, పెట్టుబడి స్కాములతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు.
సింగపూర్ లో సగటున స్కామ్ బాధితుడు 4301 డాలర్లు నష్టపోయాడని, ఆ తర్వాతి స్థానాల్లో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాలు ఉన్నాయని చెప్పారు. సింగపూర్ ను లక్ష్యంగా చేసుకున్న నేరస్తులు ప్రధానంగా విదేశాల నుంచి పనిచేస్తున్నారని ఆ దేశ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారి డాక్టర్ ఎన్జీ లీ సా తెలిపారు.