రష్యన్ క్రిప్టో వ్యాపారవేత్త రోమన్ నోవాక్, అతని భార్య అన్నా నోవాక్ దుబాయ్‌లో హత్యకు గురయ్యారు. దుబాయ్ ఎడారిలో శరీరం ముక్కలు ముక్కలుగా నరికివేయబడినట్టుగా మృతదేహాలు కనిపించాయి. ప్రతీకారంతోనే ఈ హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
పెట్టుబడిదారులతో సమావేశానికి వెళ్తున్నట్లుగా అక్టోబర్ 2న రోమన్ నోవాక్ దంపతులు దుబాయ్‌కు వెళ్లారు. కారు డ్రైవర్ ఒమన్ సరిహద్దుకు దగ్గరగా హట్టా ప్రాంతంలో ఒక సరస్సు దగ్గర దింపాడు. అక్కడ నుంచి రెండో వాహనంలో బయల్దేరి వెళ్లారు. అప్పటి నుంచి ఎలాంటి సమాచారం లేదు. అయితే తాను ఒమన్ సరిహద్దులోని పర్వతాల్లో చిక్కుకున్నానని.. తనకు డబ్బులు అవసరం అంటూ పరిచయస్తులకు రోమన్ నోవాక్ సందేశం పంపించాడు. దీంతో బంధువులు వెతుక్కుంటూ వచ్చినా సమాచారం లభించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఫోన్ సిగ్నల్ ట్రాప్ చేయగా.. ఒకసారి హట్టాలోనూ.. ఇంకోసారి ఒమన్‌లో.. మరొకసారి దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఇక అక్టోబర్ 4 నుంచైతే పూర్తిగా సిగ్నల్స్ కట్ అయిపోయాయి.
అప్పటి నుంచి దంపతుల ఆచూకీ కోసం వెతుకుతుండగా తాజాగా దుబాయ్ ఎడారిలో మృతదేహాలు లభించాయి. భార్యాభర్తల శరీరాలు ముక్కలు ముక్కలుగా నరికేశారు. అయితే వ్యాపార లావాదేవీల్లో భాగంగానే దుండగులు కుట్ర పన్ని ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. ఒక పథకం ప్రకారమే పెట్టుబడిదారుల ముసుగులో ఆకర్షించి ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
రోమన్ నోవాక్..
రోమన్ నోవాక్ కూడా దోషిగా తేలిన మోసగాడే. ఫింటోపియో అనే ప్లాట్‌ఫామ్‌ను స్థాపించాడు. రష్యా, చైనా, పశ్చిమాసియా నుంచి పెట్టుబడులు ఆకర్షించాడు. అనంతరం 500 మిలియన్లతో పారిపోయాడు. భారీ మోసానికి పాల్పడినందుకు 2020లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. సెయింట్ పీటర్స్‌బర్గ్ జైల్లో ఆరు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. పెరోల్ మంజూర్ కాగానే 2023లో యూఏఈకి పారిపోయాడు. చివరికి ఇలా ప్రాణాలు పోగొట్టుకున్నాడు.