Russia-Ukraine War: సరిగ్గా ఏడాది క్రితం ఫిబ్రవరి 24, 2022లో ఉక్రెయిన్, రష్యాల మధ్య యుద్ధం ప్రారంభం అయింది. ఇప్పటికీ ఇరు దేశాల మధ్య రావణకాష్టంలా ఈ యుద్దం జరుగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఉక్రెయిన్, రష్యాలు తీవ్రంగా నష్టపోతున్నా, ఇరు దేశాలు పట్టు వీడటం లేదు. గతేడాది ఇదే రోజు తెల్లవారుజామున పెద్ద ఎత్తున రష్యా బలగాలు ఉక్రెయిన్ పై సైనికచర్యను ప్రారంభించాయి. ఈ యుద్ధం ఇరు దేశాలపైన మాత్రమే ప్రభావం చూపించలేదు. ప్రపంచంలో ప్రతీ దేశంపై దీని ఎఫెక్ట్ పడింది.
తక్షణ కారణం ఇదే..
వెస్ట్రన్ దేశాలు ఉక్రెయిన్ ను నాటో కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నించడంతో రష్యా దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకప్పుడు సోవియట్ యూనియన్ లో భాగం అయిన ఉక్రెయిన్, అమెరికా నేతృత్వంలోని నాటో కూటమిలో చేరితే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని రష్యా భావించింది. నాటోలో చేరొద్దని ఉక్రెయిన్ ను హెచ్చరించింది. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ మాత్రం రష్యా బెదిరింపులను పట్టించుకోకుండా నాటోలో చేరేందుకే మొగ్గు చూపాడు. ఇదిలా ఉంటే యుద్ధానికి ఓ కారణం కావాలి కాబట్టి.. ఉక్రెయిన్ దేశంలో రష్యన్ మాట్లాడే డాన్ బాస్ ప్రాంతంలోని ప్రజలపై ఉక్రెయిన్ 2014 నుంచి అకృత్యాలకు పాల్పడుతోందని రష్యా ఈ యుద్ధాన్ని మొదలు పెట్టింది.

ఎదురొడ్డి నిలిచినా..ధ్వంసం అవుతున్న ఉక్రెయిన్..
యుద్ధం ప్రారంభానికి ముందు బలమైన సైన్యం, ఆయుధ సంపత్తి కలిగిన రష్యా ముందు కేవలం కొన్ని రోజుల్లోనే ఉక్రెయిన్ లొంగిపోతుందని అనుకున్నప్పటికీ.. ఇప్పటికీ ఎదురొడ్డి పోరాడుతోంది. అమెరికా, యూకే, ఇతర యూరోపియన్, నాటో దేశాలు ఇస్తున్న సహకారంతో రష్యాను ఎదురిస్తోంది. యుద్ధంలో గెలవకపోయినా.. ఎదురొడ్డి నిలబడుతోంది. ముందుగా రష్యా సేనలు రాజధాని కీవ్ నగరాన్ని చేరుకున్నా, దాన్ని దక్కించుకోకుండా ఉక్రెయిన్ సైన్యం నిలువరించగలిగింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ పై రష్యా క్షిపణులతో విరుచుకుపడింది. కీవ్ తో పాటు రెండో పెద్ద నగరం ఖార్కీవ్ తో పాటు మరియోపోల్, ఎల్వీవ్, జపొరోజ్జియా వంటి నగరాలు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి.
ఇదిలా ఉంటే యుద్ధంలో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతాలైన ఖేర్సన్, లూహాన్స్క్, డోనాట్స్క్, జపోరిజ్జియా నాలుగు ప్రాంతాలను రష్యా తనలో విలీనం చేసుకుంది. 2014లో రష్యా, ఉక్రెయిన్ ప్రాంతమైన క్రిమియాను కోల్పోయిన తర్వాత మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రాంతాలను దక్కించుకునేందుకు ఇరు దేశాల మధ్య తీవ్ర యుద్ధం జరుగుతోంది.

ప్రపంచంపై ప్రభావం..
కేవలం ఈ యుద్ధం ఈ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాలేదు. మిగతా ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభం, ఇంధన సంక్షోభానికి కారణం అయింది. గోధుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ కోరత ఏర్పడింది. ఇప్పటికీ ఈ సమస్యలను ప్రపంచం ఎదుర్కొంటూనే ఉంది. గోధుమలు, సన్ ఫ్లవర్ ఆయిల్ ను ప్రపంచంలో ఉత్పత్తి చేసే టాప్ దేశాల్లో ఉక్రెయిన్, రష్యా ఉన్నాయి. యుద్ధం వల్ల ఎగుమతులు కష్టంగా మారాయి. ముఖ్యంగా యూరప్ దేశాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. ఇదిలా ఉంటే క్రూడ్ ఆయిల్ ను, గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి చేసే రష్యాపై ఆంక్షలు విధించడంతో యూరప్ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. యుద్ధం వల్ల 70 వేల కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. 7199 మంది పౌరులు మరణించారు. 11,756 మంది గాయపడ్డారు.

యుద్ధానికి అంతం లేదా..?
ఈ యుద్ధానికి ముగింపు పలకాలని అన్ని దేశాలు రష్యా, ఉక్రెయిన్ ను కోరుతున్నాయి. యుద్ధం తొలినాళ్లలో బెలారస్, టర్కీ వేదికగా శాంతి చర్చలు జరిగినా, అవి ఫలించలేదు. వెస్ట్రన్ దేశాలు ఇస్తున్న ఆర్థిక, సైనిక సహకారంతో ఉక్రెయిన్ యుద్ధం చేయడానికే మొగ్గు చూపింది. చర్చలకు సిద్ధం అని రష్యా ప్రకటించినా.. జెలన్ స్కీ మాత్రం యుద్ధం చేయాలనే భావిస్తున్నాడు. పుతిన్ అధికారం నుంచి దిగిపోతేనే చర్చలంటూ జెలన్ స్కీ గతంలో ప్రకటించారు. ప్రస్తుతం యుద్ధానికి ముగింపు పలికేలా భారత్, చైనా వంటి దేశాలు తెరవెనక ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే జెలన్ స్కీ మాత్రం అమెరికా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్ నుంచి ఆయుధాలను కోరుతూ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇటీవల అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ ఉక్రెయిన్ ను సందర్శించారు.