ఉక్రెయిన్‌లో రష్యా విధ్వంసం కొనసాగుతోంది. యుద్ధం నాల్గో రోజుకు చేరుకోగా..మూడోరోజు ప్రధాన నగరాలే టార్గెట్‌గా రష్యా సైన్యం… మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. సిటీల్లోకి ట్యాంకులు చొచ్చుకెళ్తున్నాయి. ముఖ్యంగా జనావాసాలపైనా బాంబుల వర్షం కురుస్తోంది. దీంతో చాలా భవనాలు ధ్వంసమయ్యాయి. ఉన్నది కొద్ది పాటి సైన్యం. రష్యాకున్నంత ఆయుధ సంపత్తి లేదు. అయినా ఉక్రెయిన్ సైనికులు వెన్నుచూపడం లేదు. ప్రపంచంలోనే ఓ అమేయశక్తి నేరుగా దాడి చేస్తున్నా.. మాతృభూమిని రక్షణలో ప్రాణాలర్పిస్తున్నారు. మా ప్రాణమున్నంతవరకూ మా మాతృభూమిని ఆక్రమించలేరంటూ… పోరాట పటిమ చూపిస్తున్నారు. అంతేనా.. పౌరులు సైతం యుద్ధరంగంలోకి అడుగు పెడుతున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులను సురక్షిత ప్రాంతాలకు తరలించి, తమ కర్తవ్యదీక్షలో నిమగ్నమవుతున్నారు.
Read Also: Ukraine Russia War: భారత్‌పై తీవ్ర ప్రభావం.. వీటి ధరలు పెరుగుతాయి..!
కీవ్ నగరం వైపు రష్యన్ సేనలు చొచ్చుకొస్తున్న తరుణంలో అగ్రరాజ్యం అమెరికా… ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి ఓ ప్రతిపాదన చేసింది. సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని ఆఫరిచ్చింది. అయితే.. ఆ ఆఫర్‌ను తిరస్కరించారు జెలెస్కీ.. దేశం విడచి పారిపోయే ప్రసక్తే లేదని.. మాతృభూమికోసం పోరాటం చేస్తామన్నారు. తమకు ఆయుధాలివ్వాలని అభ్యర్థించారు. ఉక్రెయిన్ మాజీ అధ్యక్షుడు పెట్రో పోరోషెంకో సైతం ఏకే47 తుపాకీతో తమ సైన్యంతో కలిసి గస్తీ కాస్తున్నారు. మా ప్రాణాలు ఉన్నంతవరకు రష్యా మా దేశాన్ని ఆక్రమించుకోలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రష్యా అధ్యక్షుడిపై పోరోషెంకో మండిపడ్డారు. పుతిన్‌కు పిచ్చిపట్టిందని వ్యాఖ్యానించారు. దేశం కోసం పోరాడేందుకు తమ పౌరులు సిద్ధంగా ఉన్నారని, కానీ, తమవద్ద ఆయుధాలు లేవన్నారు. మరోవైపు..ఉక్రెయిన్ పార్లమెంట్ సభ్యురాలు కియారా రుదిక్ సైతం యుద్ధంలోకి దిగారు. చేతిలో ఏకే47తో ఉన్న ఓ ఫోటోను ట్విటర్‌లో పంచుకున్నారు. ఒకవైపు రష్యా సైనిక చర్యను తీవ్రంగా ప్రతిఘటిస్తూనే.. సైనిక, ఆర్థిక, రాజకీయ అంశాల్లో ఆయా దేశాల మద్దతు కోరుతున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. భారత ప్రధాని నరేంద్ర మోడీతోతో మాట్లాడినట్లు జెలెన్‌స్కీ ట్విటర్ వేదికగా తెలిపారు. రష్యా దూకుడును కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో.. ఐరాస భద్రతామండలి మాకు రాజకీయ మద్దతు ఇవ్వాలని భారత్‌కు విజ్ఞప్తి చేశా అని జెలెన్‌స్కీ ట్వీట్ చేశారు.
కీవ్ నగరంలోకి ప్రవేశించిన రష్యా బలగాలను ఉక్రెయిన్ సైన్యం బలంగా ప్రతిఘటిస్తున్నట్లు ఆ దేశ సైనిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు దాదాపు 3,000 మంది రష్యా సైనికులు మరణించారని తెలిపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో మాట్లాడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. పశ్చిమ దేశాలు తమకు ఆయుధాలను పంపిస్తున్నాయన్నారు. కీవ్‌ను రక్షించుకునే పోరులో మిత్రదేశాల నుంచి ఆయుధాలు అందుతున్నాయన్నారు.దౌత్యపరంగా కొత్త రోజు ఆరంభమైందని వ్యాఖ్యానించారు. అయితే..ఉక్రెయిన్‌లో సైనిక చర్య ప్రారంభమైనప్పటి నుంచి 821 ఉక్రెయిన్ సైనిక స్థావరాలను ధ్వంసం చేసినట్లు రష్యా తెలిపింది. 14 ఎయిర్‌బేస్‌లు, 19 కమాండ్ ఫెసిలిటీలు, 24 ఎయిర్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థలు, 48 రాడార్లు, 7 యుద్ధవిమానాలు, ఏడు హెలికాప్టర్లు, 9 డ్రోన్లు, 87 ట్యాంకులు, 8 మిలిటరీ వెసెల్స్‌ను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. మరోవైపు ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో ఉన్న కీలక నగరం మెలిటోపోల్‌ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా సైనికాధికారులు తెలిపారు. అలాగే తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌లో వేర్పాటువాదులు మెజారిటీ ప్రాంతాలపై పట్టు సాధించారన్నారు. రష్యా సైన్యాలు పెద్దఎత్తున క్షిపణులు, శతఘ్నుల దాడులతో విరుచుకుపడుతుండటంతో.. ప్రాణ భయంతో వేలాదిమంది ఉక్రెనియన్లు పొరుగు దేశాలకు తరలిపోతున్నారు.ఇప్పటివరకు తమ దేశానికి లక్షకుపైగా ఉక్రెయిన్ వాసులు తరలివచ్చినట్లు పోలాండ్ తెలిపింది. తమ దేశానికి వచ్చిన వారిలో 90 శాతం మంది తమ బంధువులు, స్నేహితుల ఇళ్లలో తలదాచుకున్నారని, మిగతావారి కోసం తొమ్మిది సహాయక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రష్యా దాడులకు ముందు నుంచే పోలాండ్‌లో 15 లక్షల మంది ఉక్రేనియన్లు నివసిస్తున్నారు. తాజాగా రష్యా మిలిటరీ ఆపరేషన్ చేపట్టడంతో ….ఈ దేశం ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించింది.