అమెరికా అధ్యక్షుడు ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య గంట పాటు ఫోన్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా జరిగిన పరిణామాలు గురించి వీరిద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై కూడా చర్చించారు. భారత్-పాకిస్థాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల గురించి సంభాషించారు. ట్రంప్-పుతిన్.. భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతలతో పాటు ప్రపంచ సమస్యలపై చర్చించారని రష్యా అధికారిక కార్యాలయం క్రెమ్లిన్ ప్రతినిధి యూరీ ఉషాకోవ్ తెలిపారు. అయితే ఏం సంభాషించారో వివరంగా తెలియజేయలేదు.
ఇది కూడా చదవండి: Gold Rates: బంగారం మరింత ప్రియం.. ఒక్క రోజే రూ. 430 పెరిగిన తులం గోల్డ్ ధర
ఇక పుతిన్‌తో సంభాషణ తర్వాత ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో వివరాలు వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధం, ఇరాన్ అణు కార్యక్రమం, తదితర ప్రపంచ విషయాలపై ఇద్దరం మాట్లాడుకున్నట్లు తెలిపారు. ఇద్దరి మధ్య గంటా 15 నిమిషాల పాటు చర్చ కొనసాగిందని.. అయితే ఇది తక్షణ శాంతికి దారితీసే సంభాషణ కాదని తేల్చి చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో షాక్.. కొలంబియా యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తామని వార్నింగ్
ఇదిలా ఉంటే అమెరికా అణు ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మీడియాతో మాట్లాడుతూ అమెరికా కోరుకుంటున్నట్లు టెహ్రాన్ తన యురేనియం సమృద్ధిని ఎన్నటికీ వదులుకోదని స్పష్టం చేశారు. అమెరికా కొత్త అణు ఒప్పంద ప్రతిపాదన తమ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని ఇరాన్ పేర్కొంది. ఇరాన్ తమ యురేనియం సమృద్ధిని కొనసాగిస్తామని పట్టుబడుతుండగా..అమెరికా దానిని నిలిపివేయాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇక పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. అనంతరం పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. అయితే ఈ కాల్పుల విరమణకు తానే కారణమని ట్రంప్ పలుమార్లు ప్రకటించారు. అందుకు భారత్ అంగీకరించలేదు. ఇరు దేశాల చర్చలతోనే కాల్పుల విరమణ జరిగిందని భారత విదేశాంగ స్పష్టం చేసింది. తాజాగా ఇదే అంశంపై ట్రంప్-పుతిన్ మధ్య సంభాషణ జరిగినట్లుగా రష్యా వెల్లడించింది.