ఇరాన్‌పై దాడి విషయంలో అమెరికా వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. సౌదీ అరేబియా, ఖతార్ మధ్యవర్తిత్వంతో ట్రంప్ వెనకడుగు వేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు చక్కర్లు కొట్టాయి. అమెరికా సైన్యాన్ని వెనక్కి రమ్మని చెప్పినట్లుగా వార్తలు వినిపించాయి. దీంతో ఇరాన్ గగనతలాన్ని తెరిచినట్లుగా వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఈ వార్తలు ఎంత వరకు నిజమో అర్థం కావడం లేదు.

తాజాగా ఇరాన్ దిశగా యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌకతో పాటు మరో రెండు అత్యంత శక్తివంతమైన నౌకలు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక దక్షిణ చైనా సముద్రం నుంచి మధ్యప్రాచ్యానికి పయనిస్తోంది. అలాగే నార్పోక్ జలాంతర్గామి, శాన్ డియాగో LPD-22 క్షిపణి ప్రయోగ నౌక వెళ్తున్నట్లుగా సమాచారం. ఇరాన్‌లో ఉద్రిక్తతలను అణిచివేసేందుకు ఈ మూడు వెళ్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

గత కొద్ది రోజులుగా ఇరాన్ అట్టుడుకుతోంది. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. దీంతో భద్రతా దళాలు కాల్పులకు తెగబడ్డారు. దీంతో 3 వేల మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ సంఖ్య అంతకంటే ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. అయితే నిరసనకారులపై కాల్పులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో యుద్ధ నౌకలు ఇరాన్ వైపు వెళ్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
