పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు, మిలిటరీ రూలర్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశారని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ మీడియా పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అనారోగ్య సమస్యలతో కన్నుమూసినట్లు వార్తా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. 78 ఏళ్ల వయసులో తీవ్ర ఆరోగ్య సమస్యలతో, ఆరోగ్యం క్షీణించడంతో దుబాయ్ లోని ఓ అమెరికన్ ఆస్పత్రిలో చేరిన ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ మరణించినట్లు తెలుస్తోంది. ముషారఫ్ ను చూసేందుకు ఆయన బంధువులు పాక్ నుంచి దుబాయ్ వెళ్లారు.
1999 నుంచి 2008 వరకు పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. నవాజ్ షరీఫ్ ప్రజాప్రభుత్వాన్ని కూల్చి ముషారఫ్ అధికారంలోకి వచ్చారు. అధికారం కోల్పోయిన తర్వాత ముషారఫ్ దుబాయ్ లోనే ఉంటున్నారు. ఆయనపై పాకిస్తాన్ లో పలు అవినీతి, దేశ ద్రోహ కేసులు నమోదు అయ్యాయి. సైన్యంలో పనిచేసిన ముషారఫ్ 1965,1971 ఇండొో- పాక్ యుద్దాల్లో పాల్గొన్నాడు. 1999 కార్గిల్ వార్ ముషరఫ్ ఆర్మీ చీఫ్ గా ఉన్న సమయంలోనే చోటు చేసుకుంది. ఆ తరువాతే ప్రధాని నవాజ్ షరీఫ్ ను గద్దె దింపి, అధ్యక్షుడిగా అధికారం చేజిక్కించుకున్నారు. 2007లో పాకిస్తాన్ లో ఎమర్జెన్సీని ముషారఫ్ విధించారు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశారు. దీనిపై ఇప్పటిికీ పాకిస్తాన్ లో ముషారఫ్ పై కేసులు ఉన్నాయి. ముషారఫ్ పై నాలుగు సార్లు హత్యా ప్రయత్నాలు జరిగినా బతికి బయటపడ్డాడు. 2008 నుంచి దుబాయ్ లో ప్రవాసంలో ఉన్నారు.