మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీస్ సయీద్ కు చెందిన ఉగ్రసంస్థ జామాత్- ఉద్- దావా ( జేడీయూ)కు చెందిన ఇద్దరు సభ్యులను ప్రత్యర్థి గ్రూప్ కాల్చి చంపింది. ఈ ఘటన పాకిస్తాన్ లో కలకలం రేపింది. లాహోర్ కు 130 కిలోమీటర్ల దూరంలోని ఫైసలాబాద్ జరన్ వాలా చక్ 97 జిల్లాలో ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది.
జేడీయూకు చెందిన రషీద్ అలీ, షాహిద్ ఫరూఖ్ ఇద్దరు ఈద్ అల్ అదా ప్రార్థనలు ముగించుకుని వస్తుండగా.. అష్రాఫ్ ఖాశీ, జమీల్ మరో ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించి సమీపం నుంచి కాల్చి చంపారు. దీంతో వారు అక్కడిక్కడే మరణించారు. మరణించిన తర్వాత వారి డెడ్ బాడీలను తన్నుతూ మతపరమైన నినాదాలు చేశారు. నిందితులు అహ్లే సున్నత్ అనే సంస్థకు చెందిన వారు. ఓ మసీదు నిర్మాణ విషయంలో రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగుతోంది. నిందితులను ఇంకా పట్టుకోలేదని పాకిస్తాన్ పోలీస్ అధికారులు వెల్లడించారు.
Read Also: Microsoft: మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం.. 1800 మంది ఉద్యోగులపై వేటు
హఫీస్ సయీద్ జేడీయూ ఉగ్రసంస్థతో పాటు లష్కర్ ఏ తోయిబా ఉగ్రసంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరు. 2008 ముంబై ఉగ్ర ఘటనలో కీలకం వ్యవహరించిన ఉగ్రవాదుల్లో ఒకరిగా ఉన్నారు. అన్ని ఆధారాలు ఉన్నా కూడా పాక్ ప్రభుత్వం అతని పట్ల మెతక వైఖరి అవలంభిస్తోంది. పాక్ లో ఉంటూ కాశ్మీర్ తో పాటు ఇండియా వ్యాప్తంగా ఉగ్రవాద ఘటనలకు హఫీస్ సయీద్ కారణం. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ యువకులను తన ప్రసంగాలతో రెచ్చగొడుతుంటాడు.