Pakistan-Russia: భారత మిత్రదేశం రష్యా, శత్రుదేశం పాకిస్తాన్ మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్‌ని మధ్య ఆసియా దేశాల మీదుగా, రష్యాతో అనుసంధానించేలా భారీ రోడ్డు, రైలు మార్గాలు నిర్మించేందుకు రెండు దేశాలు సహకరించుకోవడానికి అంగీకరించినట్లు శుక్రవారం పాక్ మీడియా తెలిపింది. సెంట్రల్ ఆసియాలోని కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్ వంటి దేశాలను ఈ మార్గం ద్వారా అనుసంధానించనున్నారు. భూపరివేష్టిత దేశాలుగా ఉన్న మధ్య ఆసియా దేశాలకు ఓడరేవులను అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
ఇటీవల, చైనాలోని టియాంజిన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) మంత్రివర్గ సమావేశం సందర్భంగా పాకిస్తాన్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్, రష్యా ఉప రవాణా మంత్రి ఆండ్రీ సెర్గెవిచ్ నికితిన్ మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. మధ్య ఆసియా, రష్యా మధ్య వాణిజ్యానికి వ్యూహాత్మక రవాణా కేంద్రంగా పాకిస్తాన్ మారబోతోంది. దీని ద్వారా ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ, లాజిస్టిక్ కనెక్టివిటీ పెంచుతుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ గత నెలలో ఉజ్బెకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ (UAP) రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. ఇప్పుడు, ఈ ఒప్పందం రూపుదాల్చబోతోంది.
Read Also: Kakinada Crime: తన చెల్లిని ప్రేమిస్తున్నాడని కోపం.. పార్టీ అని పిలిచి చంపి పాతిపెట్టిన అన్న..
ఇప్పటికే, పాకిస్తాన్-చైనా మధ్య ‘‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)’’ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇది చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సును పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టులో కనెక్ట్ చేస్తుంది. దీంతో, పాకిస్తాన్ నుంచి నేరుగా రోడ్డు,రైలు మార్గాల ద్వారా అరేబియా సముద్రంలోకి చైనాకు మార్గం ఏర్పడుతుంది. మలక్కా జలసంధిపై ఎక్కువగా ఆధారపడకూడదని చైనా సిపెక్ ప్రాజెక్టును చేపట్టింది. ఉద్రిక్త సమయాల్లో భారత్ ఈ మార్గాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటడంతో చైనా భారీగా ఖర్చు చేసి సీపెక్‌ని నిర్మిస్తోంది.
ఈ ప్రాజెక్టుల వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా ఎంతోకొంత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే, ఆర్థిక సంక్షోభంలో కూడా పాకిస్తాన్, భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. ఇప్పుడు, భారత మిత్రదేశమైన రష్యాతో పాకిస్తాన్ చెలిమి మనకు ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్ బలపడితే అది ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్‌ని ఇరుకునపెట్టే అవకాశం ఉంటుంది.