Pakistan Allegations: పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదంతో ‘‘డ్యూరాండ్ లైన్’’ వద్ద తుపాకులు గర్జిస్తున్నాయి. ఇప్పటికే, రెండు వైపుల పదుల సంఖ్యలో సైనికులు మరణించారు. ఇదిలా ఉంటే, కాల్పుల విరమణ ఉన్నప్పటికీ, పాకిస్తాన ఆఫ్ఘాన్ సరిహద్దు జిల్లాలపై వైమానిక దాడులు నిర్వహిస్తోంది. మరోవైపు, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పాక్-అఫ్ఘాన్ వివాదాన్ని భారత్‌తో ముడిపెట్టారు. ఆఫ్ఘనిస్తాన్‌తో సంబంధాలను తెంచుకున్నట్లు ప్రకటించారు. పాకిస్తాన్ లో నివసిస్తున్న అందరు అఫ్ఘాన్లు స్వదేశానికి వెళ్లాలని ఆదేశించారు.
Read Also: GST 2.0 report: దుమ్మురేపిన దసరా కొనుగోళ్లు.. ఎలక్ట్రానిక్స్, కార్‌ల సేల్స్ అదుర్స్..
ఆఫ్ఘాన్ ‘‘భారతదేశ ప్రాక్సీ’’గా మారిందని, భారత్, నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)తో కలిసి పాకిస్తాన్‌పై కుట్ర చేస్తోందని ఆసిఫ్ ఆరోపించారు. ‘‘ఇప్పుడు భారతదేశం ఒడిలో కూర్చుని పాకిస్తాన్‌పై కుట్రలు పన్నుతున్న కాబూల్ పాలకులు ఒకప్పుడు మన రక్షణలో ఉన్నారు, మన భూమిపై దాక్కున్నారు’’ అని ఆయన అన్నారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ ఇటీవల భారతదేశ పర్యటన తర్వాత పాక్ రక్షణ మంత్రి నుంచి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వచ్చాయి.
‘‘పాకిస్తాన్ గడ్డపై నివసిస్తున్న ఆఫ్ఘాన్లు వారి స్వదేశానికి వెళ్లాలి. వారికి కాబూల్ లో సొంత ప్రభుత్వం ఉంది. మన భూమి, వనరులు 250 మిలియన్ల పాకిస్తానీయులకు చెందినవి.’’ అని అన్నారు. కాబూల్ నుంచి దురాక్రమణలు ఎదురైతే పాకిస్తాన్ అందుకు సిద్ధంగా ఉందని, తనను తాను రక్షించుకునే సామర్థ్యం ఉందని ఆసిఫ్ అన్నారు.