Fitna al-Hindustan: ఇండియానే టార్గెట్ చేస్తోన్న పాకిస్థాన్.. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ పేరుతో కొత్త కుట్ర?

  • బలూచిస్తాన్ సంక్షోభాన్ని భారత్‌తో ముడిపెడుతున్న పాకిస్థాన్..
  • ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ వెనుక అసలు వ్యూహం ఇదే!
Pakistan

Pakistan

Fitna al-Hindustan: పాకిస్థాన్ మరోసారి బలూచిస్తాన్‌లో కొనసాగుతున్న హింస, వేర్పాటువాద ఉద్యమాన్ని భారత్‌తో ముడిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం పాకిస్థాన్ కొత్త నేరేటివ్‌ను తెరపైకి తీసుకొచ్చింది. బలూచ్ తిరుగుబాటు సంస్థలను ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ (Fitna al-Hindustan) పేరుతో భారత్‌తో అనుసంధానించే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈ పదం వెనుక పాకిస్థాన్ వ్యూహమేంటి? బలూచిస్తాన్‌లోని దశాబ్దాల నాటి సమస్యను భారత్‌పైకి మళ్లించడమే లక్ష్యమా? అనే చర్చ తాజాగా మొదలైంది. ఆగస్టు 24న బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) బలూచిస్తాన్‌లోని మస్తుంగ్ ప్రాంతంలో పాకిస్థాన్ భద్రతా బలగాలపై జరిగిన దాడికి బాధ్యత వహించినట్లు ప్రకటించింది. IED దాడిలో 13 మంది పాకిస్థాన్ సైనికులు మరణించినట్లు BLA పేర్కొంది. బలూచిస్తాన్‌లో పాకిస్థాన్ భారీ స్థాయిలో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు నిర్వహిస్తున్నామని చెబుతున్న సమయంలోనే ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రభుత్వ భాషలోకి ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ అంటే..

బలూచిస్తాన్‌లో జరుగుతున్న హింసకు భారత్ కారణమని పాకిస్థాన్ చాలా కాలంగా ఆరోపణలు చేస్తోంది. అయితే తాజాగా ఆ ఆరోపణలకు అధికారిక రూపం ఇచ్చే ప్రయత్నం కనిపిస్తోందని రక్షణ వర్గాలు పేర్కొంటున్నాయి. 2025 మేలో పాకిస్థాన్ హోం మంత్రిత్వ శాఖ.. బలూచిస్తాన్‌లో క్రియాశీలంగా ఉన్న తిరుగుబాటు సంస్థలను ప్రస్తావించేటప్పుడు ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ అనే పదాన్ని ఉపయోగించాలని ప్రభుత్వ సంస్థలకు సూచించినట్లు సమాచారం. ఆ తర్వాత పాకిస్థాన్ ప్రభుత్వం, సైన్యం ప్రకటనల్లోనూ ఈ పదం తరచుగా వినిపిస్తోంది. ఆగస్టు 21న పాకిస్థాన్ సైన్యం ప్రజా సంబంధాల విభాగం ISPR.. ఖైబర్ పఖ్తున్‌ఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో నిర్వహించిన ఆపరేషన్లలో 49 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రకటించింది. వీరిలో 37 మందిని ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’తో సంబంధం ఉన్నవారిగా పేర్కొంది. దీంతో పాకిస్థాన్ ఇప్పుడు ఒక నిర్దిష్ట దాడి వెనుక భారత్ హస్తం ఉందని ఆరోపించడం మాత్రమే కాకుండా.. బలూచిస్తాన్‌లోని మొత్తం తిరుగుబాటు ఉద్యమాన్ని భారత్‌తో అనుసంధానించే ప్రయత్నం చేస్తోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బలూచిస్తాన్ సమస్య ఇప్పటిది కాదు..
అయితే బలూచిస్తాన్‌లో అసంతృప్తి, తిరుగుబాటు కొత్త విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్థాన్ ఏర్పడిన తొలి దశల నుంచే ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ అసంతృప్తి, వేర్పాటువాద ఉద్యమాలు కొనసాగుతున్నాయని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు. బలూచ్ నేతల ప్రధాన డిమాండ్లలో రాజకీయ ప్రాతినిధ్యం, ప్రావిన్షియల్ స్వయంప్రతిపత్తి, సహజ వనరులపై స్థానికులకు హక్కు, అభివృద్ధిలో అసమానత, భద్రతా బలగాల చర్యలు వంటి అంశాలు ఉన్నాయి. అందువల్ల బలూచిస్తాన్ సమస్యను పూర్తిగా భారత్‌కు సంబంధించిన కుట్రగా చూపించడం.. అక్కడి దశాబ్దాల రాజకీయ, సామాజిక అసంతృప్తి నేపథ్యాన్ని పక్కన పెట్టడమే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో బలూచ్ తిరుగుబాటు సంస్థలు జరిపే ఉగ్రదాడులను సమర్థించడానికి ఇది కారణం కాదనే విషయాన్ని కూడా గుర్తించాలని అంటున్నారు.

పాకిస్థాన్‌కు ‘ఇండియా కార్డ్’ ఎందుకు కీలకం..
బలూచిస్తాన్ సమస్యను భారత్‌తో అనుసంధానించడం పాకిస్థాన్‌కు రాజకీయంగా ఉపయోగపడే వ్యూహంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల దేశంలోనే ఉన్న సమస్యకు బయటి శత్రువును కారణంగా చూపించే అవకాశం లభిస్తుంది. అంటే.. బలూచిస్తాన్‌లో దశాబ్దాలుగా అస్థిరత ఎందుకు కొనసాగుతోంది? పాకిస్థాన్ భద్రతా విధానాలు అక్కడ పరిస్థితిని ఎందుకు అదుపులోకి తీసుకురాలేకపోతున్నాయి? వంటి ప్రశ్నల నుంచి తలెత్తే చర్చను భారత్ వైపు మళ్లించే అవకాశం ఇస్లామాబాద్‌కు లభిస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఖైబర్ పఖ్తున్‌ఖ్వాలోని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ (TTP) వంటి సంస్థలను పాకిస్థాన్ సాధారణంగా ‘ఫిత్నా అల్-ఖవారిజ్’గా పేర్కొంటోంది. అదే సమయంలో బలూచిస్తాన్ తిరుగుబాటుదారుల విషయంలో ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ అనే పదాన్ని ఉపయోగించడం ద్వారా నేరుగా భారత్‌ను నేరేటివ్‌లోకి తీసుకువస్తోంది.

అంతర్జాతీయ వేదికలపైనా అదే నేరేటివ్
పాకిస్థాన్ ఈ ఆరోపణలను దేశీయ రాజకీయాలకు మాత్రమే పరిమితం చేయకుండా అంతర్జాతీయ వేదికలపై కూడా ప్రస్తావిస్తోంది. భారత్ పాకిస్థాన్‌పై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదని ఆరోపిస్తున్న నేపథ్యంలో.. తాము కూడా భారత్‌పై ఇలాంటి ఆరోపణలు చేయగలమనే వాదనను అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. అయితే భారత్ పాకిస్థాన్ ఆరోపణలను ఖండిస్తోంది. ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ వంటి పదాలను పాకిస్థాన్ చేస్తున్న తప్పుదోవ పట్టించే ప్రచారంలో భాగంగా భారత్ అభివర్ణిస్తోంది. ముఖ్యంగా పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ ప్రోత్సహిత ఉగ్రవాదంపై భారత్ తన దౌత్యపరమైన ఒత్తిడిని మరింత పెంచింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు పరస్పరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయనే విధంగా కథనాన్ని మార్చేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పాక్‌కి బలూచిస్తాన్ ఎందుకంత కీలకం అంటే..
బలూచిస్తాన్ పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ మాత్రమే కాదు.. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం కూడా. ఈ ప్రాంతానికి ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో సరిహద్దులు ఉండటంతో పాటు అరేబియా సముద్రం వెంట సుదీర్ఘ తీరప్రాంతం ఉంది. చైనా – పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC), గ్వాదర్ పోర్ట్ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. చైనాకు చెందిన పౌరులు, చైనా ప్రాజెక్టులపై గతంలో పలుమార్లు దాడులు జరిగాయి. దీంతో బలూచిస్తాన్‌లో అస్థిరత చైనాకు కూడా ఆందోళన కలిగించే అంశంగా మారింది. అంతేకాదు.. ఇరాన్ – పాకిస్థాన్ సరిహద్దు, ఆఫ్ఘనిస్థాన్‌కు సంబంధించిన భద్రతా పరిస్థితులపై కూడా బలూచిస్తాన్ పరిణామాలు ప్రభావం చూపే అవకాశం ఉంది.

భారత్ ముందున్న సవాలు ఇదే
పాకిస్థాన్ ‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ నేరేటివ్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్తున్న నేపథ్యంలో భారత్‌కు ప్రధాన సవాలు.. బలూచిస్తాన్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు మద్దతు ఇస్తున్నట్లు కనిపించకుండా పాకిస్థాన్ ఆరోపణలను ఖండించడం. ఈ విషయంలో మూడు అంశాలను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయడుతున్నారు.

మొదటిది: బలూచిస్తాన్‌లో రాజకీయ, సామాజిక అసంతృప్తికి సుదీర్ఘ చరిత్ర ఉంది.

రెండోది: భద్రతా బలగాలు లేదా సాధారణ పౌరులపై జరిగే ఉగ్రదాడులను ఎలాంటి పరిస్థితుల్లోనూ సమర్థించలేం.

మూడోది: బలూచిస్తాన్‌లో ఉగ్రవాదానికి భారత్ మద్దతు ఇస్తోందన్న పాకిస్థాన్ ఆరోపణలను ఆధారాలు, సాక్ష్యాల ఆధారంగానే పరిశీలించాలి. ఒక సంస్థ పేరులో ‘హిందుస్తాన్’ అనే పదాన్ని చేర్చడం మాత్రమే ఆరోపణకు ఆధారంగా మారదు.

‘ఫిత్నా అల్-హిందుస్తాన్’ అనేది కేవలం ఓ పదబంధం కాదని.. పాకిస్థాన్ రూపొందిస్తున్న కొత్త నేరేటివ్‌లో భాగమని విశ్లేషణలు సూచిస్తున్నాయి. ప్రభుత్వ ప్రకటనలు, సైనిక చర్యలు, అంతర్జాతీయ వేదికల ద్వారా ఈ పదాన్ని పదేపదే ప్రస్తావించడం ద్వారా బలూచిస్తాన్ సమస్యను భారత్-పాకిస్థాన్ ఘర్షణలో మరో అధ్యాయంగా చూపించాలన్న ప్రయత్నం కనిపిస్తోందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. బలూచిస్తాన్‌లోని దశాబ్దాల నాటి అంతర్గత సమస్యను భారత్‌తో అనుసంధానిస్తూ అంతర్జాతీయ స్థాయిలో కొత్త కథనాన్ని సృష్టించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ నేరేటివ్ ఎంతవరకు వాస్తవ ఆధారాలతో నిలబడుతుందనేది ఇప్పుడు కీలకంగా మారింది.