Pakistan: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ అధికారంగా సైనిక బాధ్యతలు చూస్తున్నారు. ఇదే కాకుండా పాక్ ప్రభుత్వంతో ఈయన చెప్పిందే వేదం. పాకిస్తాన్ ప్రధాని కూడా ఈయన మాట వినాల్సిందే. అలాంటి అసిమ్ మునీర్‌కు పాకిస్తాన్ కొత్త బాధ్యతను అప్పగించింది. ఇప్పుడు పాకిస్తాన్‌లో అదుపు లేకుండా పెరుగుతున్న జనాభాను కట్టడి చేసే బాధ్యత తీసుకోబోతున్నారు.
పాక్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ వారంలో జరిగి సెనెట్ సమావేశంలో పాకిస్తాన్ ఆరోగ్య మంత్రి సయ్యద్ ముస్తఫా కమల్ మాట్లాడుతూ.. జనాభాను నియంత్రించే ఉన్నత స్థాయి కమిటీలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చోటు కల్పించిందని చెప్పాడు. 25.9 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే 5వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా పాకిస్తాన్ ఉంది. 2030 నాటికి ఇండోనేషియాను అధిగమించి నాలుగో స్థానంలోకి వస్తుందని అంచనా. పాకిస్తాన్‌లో పెరుగుతున్న జనాభాను ప్రభుత్వం జాతీయ ప్రాధాన్యతా అంశంగా భావిస్తోందని ఆరోగ్య మంత్రి వెల్లడించారు. కీలక విధాన నిర్ణయాలు తీసుకునే ప్రత్యేక కమిటిని ఏర్పాటు చేయగా, అందులో అసిమ్ మునీర్‌ను సభ్యుడిగా నియమించింది.
బలూచిస్తాన్, ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సుల్లో తిరుగుబాటుదారులు పాక్ ఆర్మీని, పోలీసుల్ని హతమారుస్తున్నారు. మరోవైపు పీఓకేలో జనం తిరగబడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ), పాక్ తాలిబాన్ల దాడులకు పాక్ ఆర్మీ కూడా భయపడుతోంది. ఇలాంటి సమయంలో సైనిక బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అసిమ్ మునీర్, జనాభా నియంత్రణ కమిటీలో చేరాడు. దీనిపై పాక్ వ్యాప్తంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ‘‘జనాభా నియంత్రణకు అసిమ్ మునీర్ ఏం చేస్తారు.? కండోమ్‌లు పంచుతారా?’’ అని సెటైర్ వేశారు.
పాకిస్తాన్‌లో ప్రతీ ఏడాది సుమారు 67 లక్షల జననాలు నమోదవుతున్నాయి. గర్భనిరోధక సాధానాల వినియోగం ప్రోత్సహించడం, కండోమ్ వంటి వాటిపై పన్ను రాయితీలు ఇవ్వడం, రాష్ట్రాలకు నిధుల పంపిణీ విధానంలో మార్పులు చేయడం వంటి చర్యల్ని పాక్ ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుత రేటుతో జననాలు పెరిగే, పాక్ ఆర్థిక వనరులపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆ దేశ ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

