Asim Munir: టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి

  • టెహ్రాన్‌కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్
  • శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
Asim Munir

Asim Munir

ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు జరగబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దీంతో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రెండు దేశాలకు మధ్యవర్తిగా ప్రస్తుతం పాకిస్థాన్ వ్యవహరిస్తోంది. ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగినా ఫలించలేదు. మరోసారి చర్చలకు అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ టెహ్రాన్‌కు బయల్దేరి వెళ్లారు.

పశ్చిమాసియాలో 3 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరాన్-అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరే అవకాశాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ ప్రభుత్వ వార్తా సంస్థ ఐఆర్ఎన్ఏ (IRNA) ఈ విషయాన్ని వెల్లడించింది.

ఇప్పటికే పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నక్వీ మూడు రోజుల పాటు టెహ్రాన్‌లో రహస్య దౌత్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్‌తో పాటు పలువురు కీలక నేతలను కలిశారు. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను తగ్గించడం, ప్రాంతీయ శాంతి స్థాపన, దీర్ఘకాలిక స్థిరత్వంపై చర్చలు జరిగినట్లు ఇరాన్, పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి.

ఈ పరిణామాల మధ్య అసీమ్ మునీర్ పర్యటన వేగంగా ఖరారవడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే సమయంలో ఇరాన్ దౌత్య వ్యవస్థలో కూడా కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘాయిని అధికారిక చర్చల బృంద ప్రతినిధిగా నియమించినట్లు అల్ అరేబియా వర్గాలు వెల్లడించాయి. అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబాఫ్‌ను మరోసారి చర్చల ప్రతినిధి బృందానికి నేతగా కొనసాగించారు.

ఇరాన్ ప్రభుత్వం చర్చల సమయంలో దౌత్య పరంగా మరింత సమన్వయంతో ముందుకు వెళ్లేందుకు ఈ మార్పులు చేపట్టినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా కీలక హెచ్చరికలు చేశారు. “ఇప్పుడే దౌత్యానికి చివరి అవకాశం. లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవు” అంటూ వ్యాఖ్యానించారు. చర్చలు విఫలమైతే అపూర్వ స్థాయి సైనిక చర్యలు ఉండవచ్చని వైట్ హౌస్ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తోంది.

ఇక ఇరాన్‌లోని కఠినవాద వర్గాలు కూడా అమెరికాపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. తాత్కాలిక విరమణను ఉపయోగించుకుని అమెరికా మళ్లీ బలపడే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూ.. అవసరమైతే మరింత కఠినంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరిస్తున్నాయి. ఈ అత్యంత ఉద్రిక్త పరిస్థితుల్లో అసీమ్ మునీర్ టెహ్రాన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వ ప్రయత్నాల్లో పాకిస్థాన్ కూడా కీలక పాత్ర పోషించే అవకాశాలపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది.