Bangladesh: రాజకీయ అస్థిరత, తీవ్ర మనోన్మాదంలో ఉన్న బంగ్లాదేశ్‌పై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. దీనికి కారణం అమెరికా నుంచి మొక్కజొన్నను దిగుమతి చేసుకోవడమే. అయితే, దీంట్లో విమర్శించాల్సిన విషయం ఏమిటని చాలా మందికి అనుమానం వస్తుంది. ఈ మొక్కజొన్నను పండించడంలో ‘‘పంది మలం’’ వాడటంతో ఇది వివాదాస్పదమైంది. బంగ్లాదేశ్ నిర్ణయంపై చాలా మంది తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికాలో మొక్కజొన్న సాగులో పంది మలాన్ని సాధారణ ఎరువుగా ఉపయోగిస్తారు. అయితే, ముస్లిం మెజారిటీ కలిగిన బంగ్లాదేశ్‌లో ఇది సమస్యగా మారింది.
సాధారణంగా ఇస్లాంలో పంది సంబంధిత ఉత్పత్తులను హరామ్(నిషిద్ధం)గా పరిగణిస్తారు. ఇటీవల, ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం, యూఎస్ మొక్కజొన్నను బంగ్లాదేశ్ కొనుగోలు చేస్తున్నట్లు పోస్ట్ చేసింది. “పోషక విలువలు ఎక్కువగా ఉన్న అమెరికన్ కార్న్ బంగ్లాదేశ్‌కు వస్తోంది. ఇది ఆహార పదార్థాలు, జంతు మేతకు ఉపయోగపడుతుంది” అని ట్వీట్ చేసింది. అయితే, ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా కార్న్ సాగులో పంది మలాన్ని ఎరువుగా ఉపయోగిస్తారని ఎత్తిచూపుతూ సోషల్ మీడియా యూజర్లు బంగ్లాదేశ్‌ను ఎగతాళి చేయడం ప్రారంభించారు.
‘‘డాన్(ట్రంప్) చేసిన తప్పుకు, బంగ్లాదేశ్‌కు అమెరికన్ మొక్కజొన్న లభిస్తుంది(పంది మలం ఎరువుతో సాగు చేసిన కార్న్). పాకిస్తాన్ గాజాకు ‘శాంతిపరిరక్షక దళాన్ని’ పంపుతోంది’’ అని ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. అంకుల్ సామ్ బంగ్లాదేశ్‌ను నాశనం చేస్తున్నాడని, బంగ్లాదేశ్ ఇప్పుడు పంది ఎరువుతో సాగైన మొక్కజొన్నను తింటారు అని మరొకరు పోస్ట్ చేశారు.
బంగ్లాపై అమెరికా ఒత్తిడి:
ఈ సంవత్సరం ప్రారంభంలో, యుఎస్ ప్రారంభంలో బంగ్లాదేశ్‌పై 37% సుంకాలను విధించింది. యూఎస్-బంగ్లా మధ్య 6 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉంది. అమెరికా సుంకాలు బంగ్లా వస్త్ర ఎగుమతుల్ని టార్గెట్ చేసింది. బంగ్లాదేశ్ ఎగుమతుల్లో 80 శాతం వాటా వస్త్రాలదే. అయితే, బంగ్లాదేశ్ తాత్కాలిక చీఫ్ మహ్మద్ యూనస్ ఈ విషయమై, ట్రంప్‌కు లేఖ రాశారు. బంగ్లాదేశ్‌కు అమెరికా ఎగుమతుల్ని పెంచుతామని చెప్పారు . దీంతో అమెరికా, బంగ్లాపై సుంకాన్ని 20 శాతానికి తగ్గించింది. ఇందులో అమెరికన్ గోధుమలు, మొక్కొజొన్న, సోయాబీన్ కూడా ఉన్నాయి. ఇటీవల, అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. 2,20,000 మెట్రిక్ టన్నుల యూఎస్ గోధుమల్ని కొనుగోలు చేయడానికి బంగ్లా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.