North Korea Executed Two Students For Watching South Korean Films: పిల్లలు ఏవైనా చిన్న చిన్న తప్పులు చేస్తే.. వాళ్లకు రెండు మొట్టికాయలు తగిలించి, మళ్లీ అలాంటి తప్పులు చేయకూడదని మందలిస్తాం. కానీ.. ఉత్తర కొరియాలో అలా కాదు. ఏకంగా మరణశిక్ష విధించారు. ఇంతకీ.. వాళ్లు చేసిన తప్పేంటో తెలుసా? కేవలం సినిమాలు చూడటమే. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. సినిమాలు చూసిన పాపానికి, ఇద్దరు విద్యార్థుల్ని బహిరంగంగా కాల్చి చంపారు.
అసలేం జరిగిందంటే.. అక్టోబర్ నెలలో ఇద్దరు విద్యార్థులు, చైనా సరిహద్దుగా ఉన్న ర్యాంగ్‌గాంగ్ ప్రావిన్స్‌లోని ఒక ఉన్నత పాఠశాలలోని కొంతమంది విద్యార్థులను కలుసుకున్నారు. వారితో కలిసి కాసేపు సరదాగా ఆడుకున్న ఆ విద్యార్థులు.. వారితో కలిసి దక్షిణ కొరియా సినిమాలు, అమెరికన్ నాటక ప్రదర్శనలను వీక్షించారు. ఇదే వారు చేసిన తప్పు. ఉత్తర కొరియాలో విదేశీ ప్రభావం ఉండకూడదన్న ఉద్దేశంతో.. ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సినిమాల్ని నిషేధించాడు. విదేశీయులతో ఎలాంటి సంపర్కం ఉండకూడదని, ఇంకా మరెన్నో ఆంక్షలు విధించాడు. వాటిని అతిక్రమించి, ఆ ఇద్దరు విద్యార్థులు సినిమాలు చూశారని, వారికి మరణశిక్ష విధించారు. ఇతరులు మళ్లీ ఇలాంటి తప్పులు చేయకూడదన్న ఉద్దేశంతో.. ప్రజల ముందే ఆ మైనర్లను అత్యంత దారుణంగా కాల్చి చంపేశారు. ఈ ఘటనతో కిమ్ జోంగ్ కర్కశత్వ పాలన మరోసారి వెలుగులోకి వచ్చింది.
సినిమాలు, డ్రామాలు, పాటలు అనేవి.. అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ మార్గాలు. ఎన్ని సమస్యలున్నా.. సినిమాలు చూస్తే కాస్త ఉపశమనం లభిస్తుంది. అందుకే.. ఉత్తర కొరియాలో నిషేధం అయినప్పటికీ, దక్షిణ కొరియా సినిమాలను అక్రమంగా రవాణా చేసుకొని, ఎవరికంట పడకుండా అతి రహస్యంగా ప్రజలు వీక్షిస్తుంటారు. ఇప్పుడు తాజా ఘటనతో ఉత్తర కొరియా ఉలిక్కి పడింది కాబట్టి.. అలా రహస్యంగా చూడటం కూడా మానేయొచ్చు.