Nimisha priya Case: కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియా యెమెన్ దేశంలో ఉరికంబానికి దగ్గర అవుతున్నారు. ఆ దేశస్తుడైన తలాల్ అబ్దో మహదీని 2017లో హత్య చేసిన కారణంగా ఆమెను అక్కడి చట్టాల ప్రకారం ఉరిశిక్ష విధించబడింది. జూలై 16న ఆమెకు ఉరిశిక్ష అమలు చేయబోతున్నారు. ప్రస్తుతం, ఈ కేసును భారత సుప్రీంకోర్టు జూలై 14న విచారించబోతోంది. ఈ కేసులో నిమిషా ప్రియాను రక్షించాలంటే, బాధితుడు మహదీ కుటుంబం ‘‘బ్లడ్ మనీ’’ రూపంలో పరిహారానికి అప్పగించడమే మార్గంగా ఉంది. మహదీ కుటుంబానికి “సేవ్ నిమిషా ప్రియ యాక్షన్ కౌన్సిల్” భారీ పరిహారాన్ని ఆఫర్ చేస్తోంది.
ఏమిటి నిమిషా ప్రియా కేసు..?
యెమెన్ దేశంలో నర్సుగా పనిచేసేందుకు వెళ్లిన నిమిషా అనూహ్యంగా హత్య కేసులో ఇరుక్కుంది. నర్సుగా యెమెన్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని సంవత్సరాలు పనిచేసింది. 2014లో ఆమె భర్త, మైనర్ కుమార్తె ఆర్థిక కారణాల వల్ల భారత్ తిరిగి వచ్చారు. అదే ఏడాది యెమెన్ అంత్యర్ధుద్ధంలో చిక్కుకుంది. దేశం కొత్త వీసాలు జారీని నిలిపివేసినందుకు తిరిగి వెళ్లలేకపోయారు.
అయితే, 2015లో నిమిషా యెమెన్ రాజధాని సనా వెళ్లిన నిమిషా అక్కడ స్థానిక యెమెన్ జాతీయుడైన మహదీతో ఓ క్లినిక్ ఓపెన్ చేసింది.యెమెన్ చట్టం ప్రకారం, క్లినిక్‌లు మరియు వ్యాపార సంస్థలను స్థాపించడానికి జాతీయులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆమె మహదీ మద్దతు కోరింది. ఆ తర్వాత పరిణామాల్లో మహదీ ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఆమె పాస్‌పోర్టుని లాక్కుని వేధింపులకు గురిచేశాడు. ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా అనేక దొంగ సాక్ష్యాలు సృష్టించాడు. ఈ నేపథ్యంలోనే ఆమె తన పాస్‌పోర్టుని లాక్కోవడానికి మహదీకి మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చింది. ఇది వికటించి అనుకోకుండా అతను మరణించాడు.
“బ్లడ్ మనీ” ఒక్కటే మార్గం:
షరియా చట్టాల ప్రకారం, ఒక వ్యక్తి ఏదైనా నేరం, ముఖ్యంగా హత్య వంటి కేసుల్లో శిక్ష నుంచి తప్పించుకోవాలంటే బాధిత కుటుంబాల ‘‘క్షమాభిక్ష’’ అవసరం. వారు క్షమిస్తేనే శిక్ష నుంచి నిందితుడు బయటపడొచ్చు. దీని కోసం బాధిత కుటుంబానికి భారీ పరిహారాన్ని ఇచ్చి క్షమాభిక్షను సాధించవచ్చు. దీనిని ‘‘బ్లడ్ మనీ’’గా పిలుస్తారు. బాధిత కుటుంబం బ్లడ్ మనీ అంగీకరించేలా యెమెన్‌కు చెందిన ప్రభావవంతమైన వ్యక్తుల సాయంతో ప్రయత్నిస్తున్నారు. మెహదీ కుటుంబానికి ఇచ్చిన ఆఫర్‌లలో, ఆ కుటుంబానికి 1 మిలియన్ డాలర్ల సాయం అందించడంతో పాటు, ఆ కుటుంబం సిఫారసు చేసిన వ్యక్తికి లేదా ఏ ఇతర వ్యక్తికైనా కేరళలో ఉచిత చికిత్స అందించడం, ఇందులో ప్రయాణ ఖర్చుల్ని కూడా భరించడం ఉంది. దీనికి తోడు మెహదీ సోదరుడు యూఏఈ, సౌదీ అరేబియాలో స్థిరపడాలని నిర్ణయించుకుంటే ఖర్చులను భరించేందుకు ముందుకొచ్చారు.