Turkey Earthquake: టర్కీ, సిరియా భూకంపంలో అంతకంతకు మరణాల సంఖ్య పెరుగుతోంది. సోమవారం టర్కీలో 7.8, 7.5 తీవ్రతతో భారీ భూకంపాలు వచ్చాయి. ఏకంగా 1000కి మించి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దీంతో టర్కీ, సిరియాలో భారీగా ఆస్తి, ప్రాణనష్టం ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు భూకంపం వల్ల టర్కీలో 17,674 మంది, సిరియాలో 3,377 మంది మరణించారని, మొత్తం 21,051 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. సహాయకచర్యల్లో అత్యంత కీలకమైన మూడు రోజులు గడిచిపోవడంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. చాలా ప్రాంతాల్లో శిథిలాలను తొలగిస్తున్నా కొద్దీ మరణాల సంఖ్య పెరుగుతోంది. 1939 తర్వాత టర్కీలో వచ్చిన భారీ భూకంపం ఇదే. టర్కీ దక్షిణ ప్రాంతం భూకంపానికి తీవ్రంగా ప్రభావితం అయింది.
Read Also: Pakistan Economic Crisis: పాకిస్తాన్ పని ఖతం..ఐఎంఎఫ్‌తో చర్చలు విఫలం..
ఓ అంచనా ప్రకారం టర్కీ దక్షిణ ప్రాంతం కోలుకునేందుకు 20 ఏళ్లు పట్టనుంది. ఈ భూకంపం వల్ల దాదాపుగా 2 కోట్లకు పైగా మంది ప్రభావితం అవుతారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచానా వేసింది. భూకంప ధాటికి టర్కీ భూభాగం 5-6 మీటర్లు పక్కకు జరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరోవైపు టర్కీకి ప్రపంచం నుంచి సాయం అందుతోంది. ఇప్పటికే భారత్ ‘ఆపరేషన్ దోస్త్’ ప్రారంభించింది. రెస్క్యూ సిబ్బందితో పాటు వైద్య సహాయాన్ని టర్కీకి అందించింది. టర్కీకి 1.78 బిలియన్ డాలర్ల సహాయాన్ని అందజేస్తామని ప్రపంచ బ్యాంక్ తెలిపింది. అమెరికా 85 మిలియన్ డాలర్ల సహాయాన్ని అందిస్తున్నట్లుగా ప్రకటించింది.
తీవ్రమైన చలి, మంచు పరిస్థితుల్లో సహాయక సిబ్బంది కార్యకలాపాలను కొనసాగిస్తోంది. చాలా వరకు భవనాలు, ఇళ్లు నేలమట్టం కావడంతో సహాయక చర్యలకు ఆలస్యం అవుతోంది. భూకంపం వచ్చిన తర్వాత మొదటి 72 గంటలు చాలా కీలకంగా భావిస్తారు. ఆ సమయంలోనే శిథిలాల కింద చిక్కుకున్నవారిని ప్రాణాలతో కాపాడటం సాధ్యం అవుతుంది. అయితే ప్రస్తుతం ఆ సమయం గడిచిపోయింది. దీంతో మరణాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.