Michigan Man Won Huge Lottery After His Wife Sends To Grocery Store: అదృష్టం తమ తలుపులు తడుతుందేమో? అని కొందరు లాటరీల్ని కావాలని కొనుగోలు చేస్తే.. మరికొందరేమో ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ అనే భావనతో క్యాజువల్‌గా కొనేస్తారు. అంటే.. రెండో రకానికి చెందిన వారికి ఆ లాటరీలపై పెద్దగా అంచనాలు ఉండవు. తగిలితే లక్, లేదంటే లైట్ అనే భావనతోనే ఉంటారు. సరిగ్గా అలాంటి భావనతోనే ఓ వ్యక్తి లాటరీ కొనుగోలు చేయగా.. అతడ్ని అదృష్టం వరించింది. నిజానికి.. అతనికి స్టోర్‌కి వెళ్లింది కూడా లాటరీ కోసం కాదు. సరుకుల కోసమని వెళ్తే, అక్కడే ఉన్న లాటరీ చూసి కొన్నాడంతే! అదే అతని తలరాతని మార్చేసింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మిచిగాన్‌కి చెందిన ప్రెస్టన్ మాకీ ఓ వ్యక్తి.. ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరాడు. సరిగ్గా అదే సమయంలో భార్య ఫోన్ చేసి, ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని సరుకులు తీసుకురమ్మని మెసేజ్ చేసింది. అప్పటికే అలసిపోయిన అతగాడు, అయిష్టంగానే సరుకులు తేవడం కోసం ఓ స్టోర్‌కి వెళ్లాడు. అక్కడే అతడి కళ్లు ఓ లాటరీ మీద పడింది. ‘ఏమో, లక్ వరిస్తుందేమో, చూద్దాం’ అంటూ లాటరీ కొన్నాడు. కట్ చేస్తే.. లాటరీ తగడంతో అతని దశ తిరిగిపోయింది. అతనికి జాక్‌పాట్ తగలడంతో.. మిలియనీర్‌గా మారిపోయాడు. లాటరీలో అతనికి 190,739 డాలర్లు (దాదాపు రూ. 1.5 కోట్లు) దక్కాయి. దీంతో.. ప్రెస్టన్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తనకు ఈ జాక్‌పాట్ తగులుతుందని అస్సలు ఊహించలేదని ప్రెస్టన్ తెలిపాడు. తన భార్య మెసేజ్ చేయకుంటే తాను స్టోర్‌కి వెళ్లేవాడినే కాదని, ఈ లాటరీ దక్కేది కాదని చెప్పాడు. తన భార్య మెసేజ్ చేయడం వల్లే స్టోర్‌కి వెళ్లానని, అక్కడ ఐదు టికెట్లు కొన్నానని పేర్కొన్నాడు. ఆ మరుసటి రోజే తనని జాక్‌పాట్ వరించిందని, అస్సలు నమ్మలేకపోయానని తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. తనకు వచ్చిన లాటరీ డబ్బుల్లో నుంచి కొంత పెట్టుబడి కోసం, మరికొంత కుటుంబం కోసం వెచ్చిస్తానని ప్రెస్టన్ వివరించాడు.