Jaish-e-Mohammed: ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం చేతిలో చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌కు బుద్ధి రావడం లేదు. ఉగ్రవాదం కోసం ఇప్పుడు మహిళలకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. జైషే చీఫ్ మసూద్ అజార్ 21 నిమిషాల ఆడియోలో ఉగ్రవాదులుగా మహిళల్ని నియమించడం, శిక్షణ ఇవ్వడం గురించి ఉంది. పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న ఉగ్రసంస్థ భారత వ్యతిరేక ప్రచారంతో బ్రెయిన్ వాష్ చేస్తోంది. భారత్ టార్గెట్‌గా కొత్త తరహా దాడులకు పాకిస్తాన్, దాని ఉగ్రసంస్థలు ప్లాన్ చేస్తున్నాయి.
సిందూర్ తర్వాత దెబ్బతిన్న జైషే మళ్లీ బలపడటానికి ప్రయత్నిస్తోంది. జమాత్ ఉల్ మోమినాత్ అనే మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేసింది. బహవల్పూర్‌లోని ‘‘మర్కాజ్ ఉస్మాన్ ఓ అలీ’’లో మసూద్ అజార్ చేసిన ప్రసంగంలో భారత్ వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. అతని దుష్ట ప్రణాళికలు వెల్లడయ్యాయి. ఉగ్రవాదంలో చేరి స్త్రీ మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తుంది అని చెప్పాడు.
Read Also: Tech Layoffs: బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉద్యోగులకు ఉద్వాసన.. ఐటీ కంపెనీల స్ట్రాటజీ..
‘‘భారతదేశం మహిళల్ని సైన్యంలోకి తీసుకుంటుంది. మీడియా ద్వారా మనకు వ్యతిరేకంగా వాడుకుంటోంది. కాబట్టి మనం మన మహిళల్ని సిద్ధం చేయాలి’’ అని ఉగ్రసంస్థ విషబీజాలు నాటుతోంది. పాకిస్తాన్‌లోని ప్రతీ జిల్లాలో జమాల్ ఉల్ మోమినాత్ శాఖలు ఏర్పాటు చేస్తామని, ప్రతీ దానికి నియామక బాధ్యత కలిగిన జిల్లా ముంతాజియా అనే మహిళా రిక్రూట్మెంట్‌లు నిర్వహిస్తుందని జైష్ చెబుతోంది. ప్రధానంగా ఉగ్రవాదుల భార్యలు, పేద మహిళలు, చనిపోయిన ఉగ్రవాదుల బంధువులే లక్ష్యంగా రిక్రూట్మెంట్ కోసం ఎంచుకుంటున్నారు. ఇప్పటికే జమాల్ ఉల్ మోమినాత్ కోసం ఆన్లైన్ జిహాద్ కోర్సులను ప్రారంభించారు. ఈ క్లాసులకు మసూద్ అజార్ సోదరి ఉమ్మే మసూద్(సమైరా) ట్రైనర్‌గా ఉందని సమాచారం.
