Site icon NTV Telugu

Operation Sindoor: ‘‘మసూద్ అజార్ కుటుంబం భారత్ దాడిలో హతమైంది’’.. జైషే ఉగ్రవాది..

Masood Azhar

Masood Azhar

Operation Sindoor: కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది. పహల్గామ్‌లో అమాయకులైన 26 మందిని చంపి, వారి కుటుంబాల్లో తీరని వేధనను మిగిల్చిన ముష్కరులకు ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత్ ధీటుగా బుద్ధి చెప్పింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్, పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద ప్రధాన కార్యాలయాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

ఇదిలా ఉంటే, భారత సైన్యం పాకిస్తాన్‌ పంజాబ్‌లోని బహవల్పూర్ జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్‌పై మే 7న రాత్రి సమయంలో భీకరమైన దాడి చేసింది. ఈ దాడిలో జైషే చీఫ్ మౌలానా మసూద్ అజార్ కుటుంబం హతమైంది. ఈ విషయాన్ని తొలిసారిగా ఆ ఉగ్రసంస్థ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కాశ్మీరీ ఒప్పుకున్నారు. బహవల్పూర్ జామియా మసీదు సుభాన్ అల్లాహ్ అనే జైషే ప్రధాన కార్యాలయంపై దాడి జరిగింది. ఈ దాడిలో అజార్ కుటుంబం ‘‘ముక్కులు ముక్కులు అయింది’’ అని కాశ్మీరీ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: CM Chandrababu: వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎర్ర చందనంపై ఆసక్తికర వ్యాఖ్యలు

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ని ప్రారంభించింది. పాకిస్తాన్ లోపల, సరిహద్దు నుంచి వందల కిలోమీటర్ల దూరంలోని బహవల్పూర్ జైషే కార్యాలయంపై భారత వైమానిక దళం ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మొత్తంగా, పాక్‌లోని 9 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసింది. ఈ దాడిలో మసూద్ అజార్‌కు కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. ఇందులో అతడి సోదరి, ఆమె భర్త, అతడి మేనల్లుడు, మేన కోడలు, అతడి కుటుంబంలోని పిల్లలు ఉన్నారు. ఈ దాడిలో అజర్ సహాయకులు నలుగురు మరణించారు.

అయితే, దాడికి సంబంధించిన వివరాలను పాకిస్తాన్ ఎప్పుడూ అంగీకరించలేకపోయినా, ఉగ్రవాదులు తమకు జరిగిన నష్టాలను ఇప్పుడిప్పుడే బయటపెడుతున్నారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాది అజార్, భారత్ లో జరిగిన 2016 పఠాన్ కోట్, దాడికి 2019లో 44 మంది సైనికుల్ని బలిగొన్న పుల్వామా దాడికి ప్రధాన కారకుడు. చివరిసారిగా మసూద్ అజార్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని గిల్గిత్ బాల్టిస్తాన్‌లో కనిపించాడు.

Exit mobile version