ప్రకాశం జిల్లాలో విషాదం నెలకొంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్తల్లో… భర్త హత్యకు గురి కాగా…భర్త మరణ వార్త తెలిసి భార్య ఆత్మహత్యకు పాల్పడింది. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇరువురి మరణం పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబందించిన వివరాల్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు కు చెందిన గాలి నాగరాజు, ఒంగోలుకు చెందిన శ్రీవల్లిని మూడేళ్ళ క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్న నాగరాజు…శ్రీవల్లి తో కలిసి ఒంగోలు హిల్ టవర్స్ వద్ద కాపురం పెట్టాడు. అయితే నాలుగు నెలల క్రితం వీరి కాపురంలో విభేదాలు వచ్చాయి. దీంతో ఇద్దరూ వేరువేరుగా జీవిస్తున్నారు. ఈ నేపద్యంలో నాగరాజు మంగళవారం రాత్రి కొండపి మండలం జాళ్ళపాలెం తిరునాళ్ళకు వెళ్ళాడు. తిరునాళ్లకు వెళ్లిన నాగరాజు టంగుటూరు మండలం మర్లపాడు వద్ద చెరువులో శవమై తేలాడు.
నాగరాజు ఒంటిపై గాయాలు ఉండటంతో హత్య చేసి చెరువులో పడేశారని నాగరాజు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు భార్య తరపు బంధువులు చంపి ఉంటారని అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒంగోలులో ఉంటున్న శ్రీవల్లి ఇంటికి వచ్చి ఆమెను పోలీసులు విచారించారు. ఒకవైపు ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త చనిపోవడం, మరోవైపు పోలీసులు విచారణ పేరుతో ఇంటికి రావడంతో తీవ్రంగా మనస్థాపానికి గురైన శ్రీవల్లి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య భర్తల్లో నాగరాజు హత్యకు గురి కాగా…భర్త మరణ వార్త తెలిసి శ్రీవల్లి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా విషాదం నింపింది. రెండు ఘటనల పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.