‘భూమిపై నూకలు ఉంటే ఎలాగైనా బతుకుతాడు’ అని పెద్దలు చెబుతుంటారు.. అది నూటికి నూరుపాళ్లు నిజమని రుజువైంది.. ఎందుకంటే.. సముద్రంలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఇక, ఎవ్వరూ ప్రాణాలతో బయటపడే అవకాశం లేదు.. కానీ, 57 ఏళ్ల వయసులోనూ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోకుండా.. ఏకంగా 12 గంటల పాటు ఈత కొడుతూ ఒడ్డుకు చేరిన మంత్రి అందరినీ ఔరా! అనిపించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హిందూ మహాసముద్రంలో మడగాస్కర్ మంత్రి సెర్జ్ గెల్లె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ప్రమాద సమయంలో.. హెలికాప్టర్‌లో మొత్తం నలుగురు ఉన్నా.. మిగతావారు ఏమయ్యారో తెలియదు కానీ.. మంత్రి సెర్జ్ గెల్లె మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు.
ఇక, ఈ ఘటనపై తన అనుభవాన్ని.. ప్రాణాలతో బయటపడిన విధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు మంత్రి సెర్జ్ గెల్లె.. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టరులో మేం నలుగురం ప్రయాణం చేస్తున్నాం.. నేను పైలెట్ వెనుక కూర్చున్నాను.. ఒక్కసారిగా ప్రమాదం జరిగింది.. నాకు లైఫ్ జాకెట్ కూడా లేదు.. కానీ, నేను సీటును విప్పి దానిని ఉపయోగించాను, నా బూట్లు, బెల్టు, ఇతర బరువైన వస్తువులను అన్నీ తీసేసి సముద్రంలో ఈదటం ప్రారంభించాను. 12 గంటల పాటు సముద్రంలో ఈదుతూ వచ్చి ఒడ్డుకు చేరాను.. ఈ ప్రమాదంలో నా సెల్ ఫోన్ పోగొట్టుకున్నాను అంటూ ట్వీట్ చేశారు. ఇక, తాను ప్రాణాలతో బయటపడినందుకు దేవుడికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తనతో పాటు ప్రయాణం చేసిన స్నేహితులు బతికి ఉన్నారో లేదో తెలియదు అంటూ విచారం వ్యక్తం చేశారు మంత్రి.. ఇక, మంత్రిగారి ధైర్యసాహాసాలపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.. అసలైన హీరో మేరేనంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు..
కాగా, సోమవారం ఈ ప్రమాదం జరిగిన తర్వాత వారికోసం అన్వేషణ కొనసాగించారు పోలీసులు.. వారు తెలిపిన వివరాల ప్రకారం, ప్రమాదానికి గల కారణాలు వెంటనే తెలియరాలేదు. దేశ పోలీసు సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెర్జ్ గెల్లె, పోలీసు అధికారి మంగళవారం ఉదయం విడివిడిగా ఒడ్డుకు చేరుకున్నారు. మడగాస్కర్ యొక్క ఈశాన్య తీరంలో ఓడ ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించడానికి హెలికాప్టర్ లో వెళ్లిన సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఓడ ప్రమాదంలో శిథిలాల నుంచి మరో 18 మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీసినట్లు చెబుతున్నారు.. దీంతో ఆ ఘటనలో మృతుల సంఖ్య 39కి చేరింది. ప్రమాద సమయంలో బోటులో మొత్తం 130 మంది ప్రయాణికులు ఉండగా, అందులో 45 మందిని రక్షించారు.