Lexi Larson Lost Her Job After Disclosing Salary In TikTok Video: కొందరు ఆనందం వచ్చినా, దుఃఖంలో ఉన్నా.. సోషల్ మీడియాలో ఆ భావనల్ని పంచుకుంటున్నారు. ఓ ఉద్యోగి కూడా అదే పని చేసింది. తనకు ప్రమోషన్ దక్కడంతో పాటు జీతం పెరిగిన విషయాల్ని టిక్‌టాక్ వీడియోలో చెప్పింది. దీంతో ఆమె ఉద్యోగం ఊడింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోలోరాడోలోని డెన్వర్ ప్రాంతానికి చెందిన లెక్సి లార్సన్ అనే ఓ అమ్మాయి ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఇటీవల ఈమె వేతనం 70 వేల డాలర్ల నుంచి 90 వేల డాలర్లకు పెరిగింది. అలాగే అకౌంటింగ్ నుంచి టెక్నాలజీ విభాగానికి మారింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు.. ప్రమోషన్‌తో పాటు వేతనం పెరగడంతో ఉబ్బితబ్బిబ్బైన లెక్సి, ఆ వివరాల్ని టిక్‌టాక్ వీడియోలో పంచుకుంది.
ఈ వీడియోలు లెక్సి పని చేసే కంపెనీ కంట పడ్డాయి. అవి చూసి ఆగ్రహించిన కంపెనీ, ఆమెను ఉద్యోగంలో నుంచి తొలగించింది. కంపెనీకి చెందిన ప్రైవేట్ సమాచారాన్ని టిక్‌టాక్ వీడియోలో తాను బహిర్గతం చేశానన్న కారణంతోనే, తనని ఉద్యోగం నుంచి తీసేసినట్టు కంపెనీ తనకు తెలిపిందని లెక్సి పేర్కొంది. అమెరికా నేషనల్ లేబర్ రిలేషన్స్ యాక్ట్ ప్రకారం.. ఉద్యోగులు తమ వేతన వివరాలను సహాద్యోగులతో పంచుకోవచ్చు. కానీ.. వాటిని ఇలా బహిర్గతం చేయడం, ఓపెన్ ప్లాట్‌ఫామ్స్‌లో చర్చించడం నిషేధం, చట్టవిరుద్ధమని లేబర్ గ్రూప్స్ అంటున్నాయి. సాధారణంగానే కొన్ని కంపెనీలు తమ రహస్యాలు బయటపడకూడదన్న ఉద్దేశంతో ఆంక్షలు విధిస్తాయి. వాటిని అతిక్రమిస్తే మాత్రం, వేటు తప్పదు. లెక్సి లార్సన్ విషయంలోనూ అదే జరిగింది.