అంతా అనుకున్నట్టుగానే జరిగింది. ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉన్నట్టుగా అగ్రరాజ్యాల నిఘావ్యవస్థలు హెచ్చరించిన కొద్దిసేపటికే కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద బాంబు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 72 మంది మృతి చెందగా, 140 మందికి పైగా గాయపడ్డారు. ఈ దాడికి తామే కారణమని ఇప్పటికే ఐసిస్ ప్రకటించింది. ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డవారి ఫొటోలను కూడా ఐసిస్ రిలీజ్ చేసింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాడులు జరిగిన కాసేపటి తరువాత సెంట్రల్ కాబూల్‌లో మరోపేలుడు సంభవించినట్టు సమాచారం. ఇక ఇదిలా ఉంటే, పెలుళ్లపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. ఈ దారుణానికి ఒడిగట్టిన ఐసిస్ నేతలను హతమార్చాలని బైడెన్ ఆదేశించారు. తమ సైనికుల ప్రాణాలుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు. దాడులకు పాల్పడ్డ వారిని క్షమించేది లేదని అన్నారు. ఆఫ్ఘన్‌లో ఉన్న అమెరికా పౌరుల తరలింపు కొనసాగుతుందని అన్నారు. ఈనెల 31 కల్లా తమ బలగాలను ఉపసంహరించుకుంటామని అధ్యక్షుడు జోబైడెన్ పేర్కొన్నారు.