కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న సంగతి తెలిసిందే. 2019 డిసెంబర్‌లో చైనాలో మొదటగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఆ తరువాత ఈ వైరస్ ప్రపంచంలోని అన్ని దేశాలకు వ్యాపించింది. అయితే, ఈ వైరస్ మూలాలను ఇప్పటి వరకు గుర్తించలేదు. కరోనా వైరస్ మూలాలపై తనకు మూడు నెలల్లో నివేదక అందజేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యూఎస్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీని ఆదేశించారు. చైనాలో మొదట కనిపించిన ఈ వైరస్ జంతువుల నుంచి వచ్చిందా లేదంటే ప్రయోగశాలలో ప్రమాదం నుంచి వచ్చిందా అనే విషయంపై 90 రోజుల్లోగా పూర్తిస్తాయి నివేదిక అందించాలని ఆదేశించారు. వైరస్ మూలాలు కనుక్కునేందుకు చైనా సైతం సహకరించాలని జోబైడెన్ కోరారు. అయితే, చైనా ఇందుకు సహకరిస్తుందా అన్నది సందేహమే. అంతర్జాతీయ పరిశోధనలకు చైనా ప్రభుత్వం ఇప్పటి వరకూ సహకరించలేదు. చైనా సహకరించకుంటే వైరస్ మూలాలను కనుగొనడం కష్టం అవుతుంది. ఎప్పటికీ అసలు నిజాలు బయటకు రాకపోవచ్చు కూడా. ఇక ఈ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 34 లక్షల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.