NTV Telugu Site icon

Italy PM On Lebanon: ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య గొడవలు.. లెబనాన్ వెళ్లిన ఇటలీ ప్రధాని

Meloni

Meloni

Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్‌లో పర్యటించారు. అయితే, శుక్రవారం లెబనాన్ తాత్కాలిక ప్రధాన మంత్రి నజీబ్ మికాటితో భేటీ అయిన తర్వాత సంయుక్త విలేకరుల సమావేశంలో మెలోని మాట్లాడుతూ.. లెబనాన్‌ పౌరులకు సంఘీభావం తెలియజేయడం కోసం వచ్చినట్లు పేర్కొన్నారు. ఇటలీ అన్ని అంతర్జాతీయ భాగస్వాముల మాదిరిగానే.. కాల్పుల విరమణ కోసం పిలుపునిస్తోందని పేర్కొన్నారు. ఈ కాల్పుల విరమణకు లెబనీస్ ప్రధాన మంత్రి, పార్లమెంటు స్పీకర్ నబీహ్ బెర్రీ సైతం అంగీకరించారని జార్జియా మెలోని తెలిపింది.

Read Also: Vettaiyan : రూ. 300 కోట్ల క్లబ్ లో రజనీకాంత్ ‘వేట్టయన్- ద హంట‌ర్‌’

అయితే, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానం 1701ని తక్షణమే అమలు చేయాలని పిలుపునిచ్చారు. లెబనాన్‌లోని ఐక్యరాజ్యసమితి మధ్యంతర దళం యొక్క భద్రతకు ఇబ్బంది లేకుండా లెబనీస్ సైన్యం సామర్థ్యాన్ని పెంచాలని అన్ని పార్టీలను కోరారు. ఇక, లెబనాన్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి పని చేసే సంస్థల ఉనికి చాలా అవసరం ఉందని ఆమె వెల్లడించారు. అలాగే, ఇజ్రాయెల్ పూర్తిగా కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలి.. అంతర్జాతీయ చట్టాన్ని గౌరవించాలని.. UN భద్రతా మండలి తీర్మానం 1701ని అమలు చేసి.. లెబనీస్ సార్వభౌమాధికారానికి సంబంధించిన ఏవైనా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే వెంటనే నిలిపివేయాలన్నారు. లెబనాన్ పై కొనసాగుతున్న దురాక్రమణను ఆపడంలో ఇటలీ సమర్థవంతమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని జార్జియా మెలోనీ తెలిపారు.