China: చైనాకు వరసగా దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. చైనా తన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అత్యంత సులభంగా అమ్ముకునేందుకు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టును తీసుకువచ్చింది. అయితే దీని వల్ల లాభం కన్నా ఎక్కువ నష్టాలే ఉన్నట్లు ప్రపంచదేశాలు గమనించాయి. ఇదే కాకుండా భారత్-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్‌కి భారత్, అమెరికా, యూఏఈ, సౌదీ అరేబియా, యూరప్ దేశాలు సమ్మతించడం చైనాకు పెద్ద దెబ్బగా మారింది. ఈ మెగా పోర్టు-రైల్ డీల్ తో చైనా ఆధిపత్యానికి గండి పడటం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also: World Bank Chief: భారత్ జీ20 ప్రెసిడెన్సీ ప్రపంచానికి మార్గాన్ని నిర్దేశించింది..
ఈ నేపథ్యంలో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్(బీఆర్ఐ) ప్రాజెక్టు నుంచి ఇటలీ వైదొలిగేందుకు సిద్ధమైనట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. బీఆర్ఐ నుంచి వైదొలగాలని యోగిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆదివారం చైనా ప్రీమియర్ లీ కియాంగ్ కి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు తెలిపింది. న్యూఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు సందర్భంగా చైనా ప్రీమియర్ లీ కియాంగ్ తో సమావేశమైన మెలోని బీఆర్ఐ నుంచి నిష్క్రమించాలని తన కోరికను బహిరంగంగా వ్యక్తం చేసింది. చైనా మల్టీ బిలియన్ డాలర్ ప్రాజెక్టు ద్వారా ఇటలీకి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదని ఆమె తెలిపినట్లు సమాచారం. 2019లో ఈ ప్రాజెక్టుపై సంతకం చేసిన ఇటలీ.. దీన్నుంచి వైదొలిగిన చైనాతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తుందని మెలోని, లీ కియాంగ్ తో చెప్పింది.
సెప్టెంబర్ 5న బీజింగ్ సందర్శించి ఇటాలియన్ విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీ బీఆర్ఐ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మేము ఊహించిన ఫలితాలను ఈ ప్రాజెక్టు తీసుకురావడం లేదని అన్నారు. అనేక ఇటాలియన్ పార్టీలు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని అన్నారు. వచ్చే నెలలో బీఆర్ఐ మూడో సమావేశానని నిర్వహించాలని బీజింగ్ అనుకుంటున్న క్రమంలో ఈ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బీఆర్ఐపై నిర్ణయం తీసుకోవడానికి తన ప్రభుత్వానికి డిసెంబర్ వరకు గడువు ఉందని మెలోని ఇటీవల చెప్పారు.