Israel-Palestine Conflict: ప్రపంచంలో కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతున్న వివాదాల్లో ఇజ్రాయిల్ – పాలస్తీనా ఒకటి. ఈ రెండు దేశాల మధ్య నిత్య ఘర్షణ చెలరేగుతూనే ఉంది. గత నెల రోజులుగా ఇరు పక్షాల మధ్య హింస చెలరేగుతూనే ఉంది. అయితే తాజాగా గాజా నుంచి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయిల్ పై మెరుపుదాడి చేసింది. ఏకంగా వేల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. పలువురు ఇజ్రాయిల్ పౌరుల్ని హతమర్చాడంతో పాటు మరికొంత మందిని బందీగా పట్టుకుంది. ఈ దాడుల్లో ఇజ్రాయిల్ కు చెందిన నగర మేయర్ మరణించాడు. మరోవైపు తాము యుద్ధంలో ఉన్నామని, హమాస్ మిలిటెంట్లు మూల్యం చెల్లించుకోవాల్సిందే అని ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ వార్నింగ్ ఇచ్చారు.
1967లో అరబ్-ఇజ్రాయిల్ వివాదం తర్వాత ఇజ్రాయిల్ వెస్ట్ బ్యాంక్ ను ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఈ రెండు ప్రాంతాల మధ్య వివాదం చెలరేగుతూనే ఉంది.
Read Also: India issues advisory: ఇజ్రాయిల్‌లోని భారత పౌరులకు కీలక సూచనలు..
చారిత్రక నేపథ్యం ఇది:
చరిత్రను పరిశీలిస్తే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయింది. యూదు మైనారిటీలు, అరబ్ మెజారిటీలు నివసించే పాలస్తీనాపై బ్రిటన్ నియంత్రణ సాధించింది. యూదుల కోసం ప్రత్యేక ప్రాంతాన్ని ఏర్పాటు చేసే బాధ్యత కూడా బ్రిటన్ తీసుకుంది. అప్పటి నుంచి ఈ రెండు సమూహాల మధ్య ఉద్రిక్తత నడుస్తూనే ఉంది.
1920, 1940లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు, ముఖ్యంగా యూరప్ నుంచి యూదులు పారిపోయి పాలస్తీనా ప్రాంతానికి వలస వచ్చారు. హోలోకాస్ట్ నేపథ్యంలో యూదులు ప్రత్యేక దేశాన్ని కోరుకున్నారు. ఈ పరిణామాలతో యూదులు, అరబ్బుల మధ్య ఘర్షణ తీవ్రమైంది. 1947లో ఐరాస పాలస్తీనాను ప్రత్యేక యూదు, అరబ్ దేశాలు గా విభజించడానికి ఓటేసింది. జెరూసలేం ప్రాంతం అంతర్జాతీయ పర్యవేక్షణలో ఉంది. అయితే యూదులు ఈ ప్రణాళికను ఓకే చెప్పినా, అరబ్బులు మాత్రం దీన్ని తిరస్కరించారు.
1948లో ఈ ఘర్షణలను అంతం చేయలేక బ్రిటన్ చేతులెత్తేసింది. యూదులు ప్రత్యేక ఇజ్రాయిల్ దేశాన్ని ప్రకటించుకున్నారు. చాలా మంది పాలస్తియన్లు దీన్ని వ్యతిరేకించారు. అ వివాదంలో అరబ్ దేశాల సైన్యం జోక్యం చేసుకుంది. లక్షలాది మంది పాలస్తియన్లు పారిపోయారు.
Read Also:Israel: “ఆపరేషన్ ఐరన్ స్వార్డ్” ప్రారంభం..మేం యుద్ధంలో ఉన్నామన్న ఇజ్రాయిల్..
యుద్ధం-శాంతి:
ఈ సమస్య ఇరు వైపులా వేల మంది ప్రాణాలను తీసేసింది. 1987లో హమాస్( హరకత్ అల్-ముక్వామా అల్-ఇస్లామియా (ఇస్లామిక్ రెసిస్టెన్స్ మూవ్‌మెంట్) అనే పేరుతో సైనిక సామర్థ్యం కలిగిన ఓ గ్రూపుని పాలస్తీనా మత గురువు షేక్ అహ్మద్ యాసిన్ ప్రారంభించారు. రెండుసార్లు పాలస్తీనా తిరుగుబాట్లు ఇజ్రాయిల్-పాలస్తీనా సంబంధాలను దిగజార్చాయి. 1990లో శాంతి ప్రక్రియకు విఘాతం కలిగిస్తూ పాలస్తీనా తిరుగుబాటు చేసింది. దీంట్లో హమాస్ ప్రమేయం ఉంది.
గతంలో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000లో అప్పటి ఇజ్రాయిల్ ప్రధాని ఎహుద్ బరాక్, పాలస్తీనా పాలకుడు యాసర్ అరాఫత్ మధ్య సంధికోసం ప్రయత్నించి విఫలమయ్యాడు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింతగా దిగజార్చింది.
నిత్య ఘర్షణ:
ఇజ్రాయిల్-పాలస్తీనా మధ్య దశాబ్ధాల కాలం నుంచి నిత్య ఘర్షణ ఉంది. ఇజ్రాయిల్ పై యుద్ధంలో చేరాలని ప్రపంచంలోని ఇస్లామిక్ యోధులకు హమాస్ పిలుపునిచ్చింది. అడపాదడపా గాజ్రా స్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ పైకి రాకెట్ల దాడులు జరుతూనే ఉన్నాయి, అయితే ఇజ్రాయిల్ కి ఉన్న ఐరన్ డోమ్ వ్యవస్థ వారి క్షిపణుల్ని నిర్వీర్యం చేస్తుంది. అయితే తాజాగా జరిగిన దాడి మాత్రం గత కొన్నేళ్లలో ఎప్పుడూ జరగని పెద్ద దాడి. పటిష్టమైన ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా దీన్ని ఊహించలేదు.
తూర్పు జెరూసలెం. గాజా, వెస్ట్ బ్యాంక్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇరు ప్రాంతాల మధ్య ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఈజిప్టు నుంచి హమాస్ ఆయుధాలు పొందకుండా ఇజ్రాయిల్ గాజా సరిహద్దుల్లో గట్టి నియంత్రణలో భాగంగా అనేక చర్యలు తీసుకుంటుంది. ఇది గాజాలో మానవ సంక్షోభానికి కారణమవుతోంది. ప్రజలు కనీసం తమ ప్రాథమిక అవసరాలు తీర్చుకునేందుకు కష్టపడుతున్నారు. ఇజ్రాయిల్ చర్యల వల్ల తాము నష్టపోతున్నామని పాలస్తీయన్లు ఆరోపిస్తున్నారు. హింస నుంచి తమను తాము తప్పించుకోవడానికే ఇజ్రాయిల్ పై దాడులు చేస్తున్నామని హమాస్ చెబుతోంది.