Israel Iran War: ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ శుక్రవారం ‘‘ రైజింగ్ లయన్’’ పేరుతో ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇరాన్ వ్యాప్తంగా ఉన్న అణు కార్యక్రమ కేంద్రాలు, ఇరాన్ టాప్ మిలిటరీ జనరల్స్, అణు శాస్త్రవేత్తలపై దాడులు నిర్వహించింది. ఇప్పటి వరకు ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 80 మంది వరకు మరణించనట్లు ఇరాన్ ధ్రువీకరించింది. ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ వందలాది క్షిపణులతో దాడులు నిర్వహించింది. ముఖ్యంగా, ఇజ్రాయిల్ ఆర్థిక కేంద్రమైన టెల్ అవీవ్‌తో పాటు పోర్ట్ సిటీ హైఫా, రాజధాని జెరూసలెంపై దాడులు చేసింది. ఈ దాడుల్లో 10 మంది ఇజ్రాయిలీలు మరణించడంతో పాటు 300 మంది వరకు గాయపడ్డారు.
ఇదిలా ఉంటే, తాజాగా వస్తున్న సమచారం ప్రకారం..ఇరాన్‌లోని పశ్చిమ ఖోరామాబాద్ లోని దాని అండర్ గ్రౌండ్ ‘‘ మిస్సైల్ సిటి’’పై ఇజ్రాయిల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇరాన్ మిస్సైల్ సిటి నాశనమైంది. మార్చి 2025లో ఇరాన్ తన శక్తిని ప్రదర్శించేలా ఈ మిస్సైల్ సిటి వీడియోని షేర్ చేసింది. అండర్ గ్రౌండ్లో ఉన్న మిస్సైళ్లను చూపించింది. ఈ ప్రచార వీడియోలో కనిపించిన మిలిటరీ జనరల్స్‌ని శుక్రవారం దాడుల్లో ఇజ్రాయిల్ హతమార్చింది.
ఇజ్రాయిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ నుంచి వచ్చిన మార్గదర్శకాలతో ఇజ్రాయిల్ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్ జెట్లు సర్ఫే్జ్ టూ సర్ఫేజ్ క్షిపణుల సాయంతో ఇరాన్ మిస్సైల్ సిటీని ఢీకొట్టింది. శనివారం ఉదయం పశ్చిమ ఇరాన్‌లోని భూగర్భ క్షిపణి నిల్వ సౌకర్యాన్ని IAF ఫైటర్ జెట్లు ఢీకొట్టాయని ఇజ్రాయిల్ మిలిటరీ ధ్రువీకరించింది. ఇదే జరిగితే మళ్లీ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాం కోలుకోవడానికి కొన్నేళ్ళ సమయం పడుతుంది.