Site icon NTV Telugu

Israel-Hamas: ఇజ్రాయెల్-హమాస్ శాంతి చర్చల్లో పురోగతి.. ఈజిప్టు చర్చలు ఫలించినట్లు సమాచారం!

Israel

Israel

ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన తొలి రౌండ్ పరోక్ష చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లుగా తెలుస్తోంది. గాజా-ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందానికి ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి హమాస్-ఇజ్రాయెల్ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి. దీంతో సోమవారం ఈజిప్టు రిసార్ట్‌లో పరోక్ష చర్చలు జరిగాయి. దీనికి హమాస్‌ బృందానికి ఖలీల్‌ అల్‌ హయ్యా నేతృత్వం వహించగా.. ఇజ్రాయెల్‌ బృందానికి నెతన్యాహు సన్నిహితుడు రాన్‌ డెర్మర్‌ నాయకత్వం వహిస్తున్నారు. కాల్పుల విరమణ, బందీల విడుదల, పాలస్తీనా ఖైదీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్‌ దళాల పాక్షిక ఉపసంహరణ తదితర అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ మధ్యవర్తిత్వంతో జరుగుతున్న ఈ చర్చలు ఎర్ర సముద్ర తీరంలోని షర్మ్‌ ఎల్‌-షేక్‌ రిసార్టులో జరిగాయని ఈజిప్టు అధికారి తెలిపారు. అమెరికా పశ్చిమాసియా రాయబారి స్టీవ్‌ విట్కాఫ్, ట్రంప్‌ అల్లుడు జేర్డ్‌ కుష్నర్‌ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Israel-Gaza War: నేటితో గాజా-ఇజ్రాయెల్ వార్ రెండేళ్లు పూర్తి.. కొలిక్కిరాని ట్రంప్ శాంతి చర్చలు

సోమవారం ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన చర్చలు సానుకూలంగా జరిగినట్లుగా అల్-ఖేరా న్యూస్ పేర్కొంది. ఇదిలా ఉంటే ఓ వైపు శాంతి చర్చలు జరుగుతుండగానే.. ఇంకోవైపు దాడులు ఆపాలని ట్రంప్ చెబుతున్నప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం దాడులు ఆపలేదు. గత 24 గంటల్లో కనీసం 19 మంది మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2023 అక్టోబర్‌ 7 నుంచి మొత్తం 67,000 మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్లు మంత్రిత్వ శాఖ నివేదించింది.

ఇది కూడా చదవండి: Priyanka Suicide Tragedy: పెళ్లికి ప్రియుడు ససేమిరా.. ప్రాణాలు తీసుకున్న ప్రియురాలు

ట్రంప్ ప్రయత్నాలను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దేల్-ఫత్తా ఎల్-సీసీ ప్రశంసించారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ బందీల కుటుంబాలు ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని నోబెల్ బహుమతి కమిటీని కోరారు. ‘‘ప్రపంచ శాంతికి అపూర్వమైన సహకారం’’ చేస్తున్నారంటూ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే గాజా-ఇజ్రాయెల్ యుద్ధం మొదలై నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. శాంతి చర్చలు సత్ ఫలితాన్ని ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే బందీలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు నెతన్యాహుపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హమాస్‌ వైఖరిపై నెతన్యాహు నిరాశగా స్పందించడంతో ‘‘నువ్వు ఎప్పుడూ ఎందుకింత దారుణమైన నెగెటివిటీని కలిగి ఉంటావో అర్థం కావడం లేదు. ఇదొక విజయం. దీన్ని స్వాగతించు’’ అని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Exit mobile version