Israel: గాజాలోని ఆస్పత్రులను హమాస్ ఉగ్రవాదులు కమాండ్ సెంటర్లుగా, షెల్టర్లుగా ఉపయోగించుకుంటున్నారని ఇజ్రాయిల్ ఇటీవల ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన నిజాలను ప్రపంచం ముందుంచింది. ముఖ్యంగా గాజాలోని అల్ షిఫా ఆస్పత్రి హమాస్‌కి ప్రధాన కేంద్రంగా ఉందని, ఈ ఆస్పత్రి కింద హమాస్ నెట్వర్క్ ఉందని ఇజ్రాయిల్ ఆర్మీ గుర్తించింది. ఈ ఆస్పత్రిని ఇప్పటికే ఇజ్రాయిల్ సైన్యం చుట్టుముట్టింది.
ఇదిలా ఉంటే అల్ షిఫా ఆస్పత్రి కంప్యూటర్లలో ఇజ్రాయిల్ బందీలకు సంబంధించిన ఫుటేజీని గుర్తించినట్లు ఇజ్రాయిల్ ప్రత్యేక దళాలు వెల్లడించాయి. హమాస్ వైద్య సదుపాయాలను తీవ్రంగా దెబ్బతీసిందని చెప్పారు. అక్టోబర్ 7 నాటి దాడిలో 240 మందిని హమాస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకుని గాజా ప్రాంతానికి తీసుకెళ్లారు. ఆ దాడిలో ఇజ్రాయిల్ పౌరులను 1400 మందిని చంపేశారు. ఇజ్రాయిల్ గాజాపై జరుపుతున్న దాడుల్లో 11 వేల మంది పాలస్తీనా ప్రజలు మరణించారు.
Read Also: Dhruva Natchathiram : స్టన్నింగ్ లుక్ తో విక్రమ్.. వైరల్ అవుతున్న న్యూ పోస్టర్..
అల్ షిఫా ఆస్పత్రి గాజాలోనే అతిపెద్దది, ఇది ఇజ్రాయిల్ మిలిటరీ ఆపరేషన్ కేంద్రంగా మారింది. దీన్ని హమాస్ స్థావరంగా ఉపయోగిస్తున్నారనే ఇజ్రాయిల్ ఆరోపణల్ని ఇస్లామిక్ మూమెంట్ ఖండించింది. ఇప్పటికీ వందలాది మంది రోగులు, వైద్య సిబ్బంది భవనంలోనే ఉన్నారని, ఆస్పత్రిలోని ప్రతీ అంతస్తులో సెర్చ్ చేస్తున్నట్లు ఇజ్రాయిల్ ఆర్మీ ప్రకటించింది. ఇందులో హమాస్‌కి చెందిన పరికరాలు, ఇంటెలిజెన్స్ మెటీరియల్స్ కనుగొనబడ్డాయి. బందీలకు సంబంధించిన సమాచారం, ఫుటేజీలను కంప్యూటర్ల నుంచి సేకరించారు.