Pakistan: పాకిస్తాన్ ఒకే సారి రెండు దేశాలతో ప్రేమాయణం నడుపుతోంది. చైనాకు కన్నుగీటి, అమెరికాను కౌగిలించుకుంటోంది. తమ ఉక్కు స్నేహితుడిగా చైనాను, పాకిస్తాన్ పిలుస్తుంటుంది. అయితే, అలాంటి స్నేహితుడిని ఇప్పుడు పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రావడంతో పాకిస్తాన్ నాయకత్వం డొనాల్డ్ ట్రంప్ పరిపాలనకు దగ్గర అవుతోంది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఇప్పటికే ట్రంప్‌తో వైట్‌హౌజ్‌లో విందులో పాల్గొన్నారు. ఇప్పుడు, పాకిస్తాన్ ప్రధాని కూడా ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు.
ఇదిలా ఉంటే, బలూచిస్తాన్‌లో సహజవనరులు, ఖనిజాలను అమెరికన్ సంస్థలకు పాకిస్తాన్ అందించేందుకు సిద్ధమైంది. ఇక భారత్ -పాక్ యుద్ధంలో కాల్పుల విరమణకు ట్రంప్ ప్రమేయం ఉందని, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలను చైనా గమనిస్తోంది. అమెరికాతో షరీఫ్, ఆసిమ్ మునీర్ చెట్టాపట్టాలు వేసుకుని తిరగడం చైనా మింగుడుపడటం లేదు.
పాకిస్తాన్ ఎప్పుడూ తమ సామంత రాజ్యంగా ఉంటుందని అనుకున్న చైనా కలలు ఆవిరయ్యాయి. చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్(CPEC)లో భాగంగా పాకిస్తాన్ వ్యాప్తంగా రోడ్డు, రైలు నిర్మాణాలు, విద్యుత్ ప్రాజెక్టుల కోసం చైనా బిలియన్ డాలర్లను కుమ్మరించింది. అయితే, ఈ ప్రాజెక్టుపై బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు దాడులు చేస్తున్నారు. చైనా వర్కర్లను, ఇంజనీర్లను హతమారుస్తున్నారు. ఈ దాడుల్ని పాకిస్తాన్ అడ్డుకోలేకపోతోంది. ఇప్పుడు బలూచిస్తాన్ లోనే అమెరికా పాగా వేసేందుకు సిద్ధమైంది. ఈ వ్యవహారంపై చైనా ఒకింత ఆగ్రహంతో ఉంది.
Read Also: Afzal Guru Grave: “అప్జల్ గురు” సమాధిని తొలగించాలని పిల్.. కీలక వ్యాఖ్యలు చేసిన కోర్టు..
నిజానికి చైనీస్ విమానాలను, మిలిటరీ హార్డ్‌వేర్‌ను పాకిస్తాన్ కొంటున్నప్పటికీ, మనసు మాత్రం అమెరికాపైనే ఉంది. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లోని బగ్రామ్ ఎయిర్ బేస్ కావాలని ట్రంప్ ఇటీవల కోరుకున్నారు. పాకిస్తాన్ ద్వారా అమెరికా మళ్లీ ఆప్ఘనిస్తాన్ రావాలని కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పరిస్థితుల్లో చైనా కీలకమైన గ్వాదర్ పోర్టు ఉన్న బలూచిస్తాన్‌లో అమెరికా ఆధిపత్యాన్ని ఎలా అంగీకరిస్తుందనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. ఈ పరిస్థితులు చూస్తే రానున్న కాలంలో పాకిస్తాన్ రెండు బలమైన శక్తుల మధ్య నలిగిపోవడం ఖాయమని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
మలక్కా జలసంధి కాకుండా, నేరుగా అరేబియా సముద్రంలోకి గ్వాదర్ ద్వారా చేరుకుందామని చైనా భావిస్తే, ఇప్పుడు పాకిస్తాన్ బలూచిస్తాన్‌లోకి యూఎస్ సంస్థల్ని అనుమతించింది. ఇది నిజంగా చైనాను చిరాకు పెట్టే సమస్యగా మారుతుంది. బలూచిస్తాన్లోని రెర్ ఎర్త్ ఖనిజాలైన రాగి, లిథియం, చమురును కొల్లగొట్టాలని అమెరికా భావిస్తోంది. పాకిస్తాన్‌ను క్రిప్టో హబ్ గా ఉంచడానికి ట్రంప్ కుటుంబానికి చెందిన వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ తో ఆ దేశం ఒప్పందం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
