Iran sentences three more protesters to death: ఇరాన్ ప్రభుత్వం వరసగా మరణశిక్షలు విధించుకుంటూ పోతోంది. గత కొన్ని నెలలుగా మహ్సాఅమిని మరణంపై ఇరాన్ అట్టుడుకుతోంది. ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పలు ప్రాంతాల్లో హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు ఆందోళనకారులు. ఈ ఘర్షణల్లో ప్రజలతో పాటు భద్రతా సిబ్బంది కూడా మరణించారు. ఇదిలా ఉంటే నిరసనల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులను దయలేకుండా పలు నేరాల్లో నిందితులుగా ఆరోపిస్తూ ఖమేనీ ప్రభుత్వం మరణశిక్షలు విధిస్తోంది. ఇప్పటికే పది మంది వరకు ఉరితీసినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే తాజాగా మరో ముగ్గురు నిరసనకారులకు మరణశిక్ష విధించింది ఇరాన్ ప్రభుత్వం. ‘దేవుడిపై యుద్ధం’ చేసిన ఆరోపణలపై ఈ ముగ్గురిపై నేరం మోపింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్ లో మతాధికారులు, ప్రజల బృందంతో ఇటీవల మాట్లాడారు. దీని తర్వాత ఈ మరణశిక్ష తీర్పులు నమోదు అయ్యాయి. దీనిపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్రవ్యతిరేకత వ్యక్తం అవుతోంది. సెప్టెంబర్ 16న 22 ఏళ్ల కుర్దిష్ ఇరాన్ యువతి అయిన మహ్సఅమిని హిజాబ్ ధరించలేదని చెబుతూ అక్కడి మోరాలిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. కస్టడీలో ఉండగానే ఆమె మరణించడంతో ఇరాన్ లో ఆందోళనలు మిన్నంటాయి. ఆందోళన నిర్వహించిన వారికి ప్రభుత్వం మరణశిక్షలు విధిస్తోంది.
Read Also: Ukarine War: ఉక్రెయిన్‌కు పాకిస్తాన్ సాయం.. భారీగా మందుగుండు సామాగ్రి సరఫరా..
శనివారం మరో ఇద్దరిని ఉరితీసింది. వీరిలో దేశవ్యాప్తంగా అనేక టైటిల్స్ సాధించిన కరాటే ఛాంపియన్ ఉండటం విషాదం. ఈ ఘటనలను ఈయూ, అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లలో బసిజ్ మిలీషియా సభ్యులను చంపిన ఆరోపణలుపై ప్రస్తుతం సలేహ్ మిర్హాషెమి, మాజిద్ కజెమీ, సయీద్ యాగౌబిలకు మరణశిక్ష విధించింది. వీరు తీర్పుకు వ్యతిరేకంగా అప్పీల్ చేసుకోవచ్చు.
1979 విప్లవం తరువాత మతాధికారులు ప్రాబల్యం ఉన్న ప్రభుత్వానికి ఇప్పుడే సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సోమవారం తన వైఖరిని స్పష్టం చేశారు. బహిరంగ స్థలాలకు నిప్పు పెట్టిన వారు ఎటువంటి సందేహం లేకుండా దేశద్రోహానికి పాల్పడినట్లే అని హెచ్చరించారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గత నెలలో ఇరాన్ అధికారులు కనీసం 26 మందికి మరణశిక్ష విధించాలని కోరింది.